హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 19 (నమస్తే తెలంగాణ): మహానగరానికి మంచినీళ్లు అందించే సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. ఎల్ నినో ప్రభావంతో ఎగువ నుంచి వరద నీరు రావడంలేదు. ప్రధానంగా సింగూరులో ఇప్పటికే నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. జలమండలి అధికారులు ఇప్పటికే ఎమర్జెన్సీ పంపింగ్‌కు ఏర్పాట్లు చేశారు. మరో రెండు రోజులు మాత్రమే సాధారణ సరఫరాకు సరిపడా నీటి నిల్వలు ఉన్నట్టు జలమండలి అధికారులు తెలిపారు. వర్షాలు పడే సూచనలు లేకపోవడంతో రెండు రోజుల తర్వాతి నుంచి ఎమర్జెన్సీ పంపింగ్ చేపట్టనున్నట్టు వెల్లడించారు.
గ్రేటర్ హైదరాబాద్‌కు నీళ్లు సరఫరా చేసే మరో ప్రధాన జలవనరు మంజీరాలోనూ నీటి నిల్వలు డెడ్‌స్టోరేజీకి చేరువలో ఉన్నాయి. సింగూరు జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.329 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఎగువ నుంచి వరద పూర్తిగా నిలిచిపోయింది. అదేవిధంగా మంజీరా పూర్తి నిల్వ సామర్థ్యం 1.500 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.338 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. రానున్న రోజుల్లో నీటి ఎద్దడి పెరుగనుండటంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు.