గద్వాల, జూలై 19 : చేనేత కార్మికులకు పొదుపు, సాంఘిక భద్రత కల్పించడంలో భాగంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేనేత కార్మికుల కోసం ఏర్పాటు చేసిన నేతన్నకు చేయూత(త్రిఫ్ట్ఫండ్ సెక్యూరిటీ) పథకానికి ప్రస్తుతం ప్రభుత్వం నిధుల కొరతతో టోకరా వేస్తుంది. 13 నెలలుగా చేనేత కార్మికుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేయాల్సిన నిధులు జమచేయక పోవడంతో త్రిఫ్ట్ స్కీం జోగుళాంబ గద్వాల జిల్లాలో బాలరిష్టాలు ఎదుర్కొంటుంది. గత ప్రభుత్వం చేనేత కార్మికులకు త్రిఫ్ట్ఫండ్, సెక్యూరిటీ ద్వారా చేనేత వృత్తిలో ఉన్నటువంటి వారికి చేయూత నివ్వాలనే ఈ పథకం తిరిగి ప్రారంభిస్తే ప్రస్తుత ప్రభుత్వం పథకానికి నిధులు విడుదల చేయకపోవడంతో పథకం అమలు తీరుపై నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న సహకార రంగం, సహకారేత రంగంలో ఉన్నటువంటి వారికి, దానికి సంబంధిత కలర్ అద్ధకం , టైయింగ్, డిజైనింగ్, వార్పింగ్, వైన్డింగ్ సైజింగ్ చేసే చేనేత కార్మికులందరికీ ఈ పథకం వర్తిస్తుంది.18 ఏండ్లు నిండి కనీసం 50శాతం చేనేత వృత్తి నుంచి ఆదాయం పొందేవారు, దాని సంబంధిత కలర్ అద్ధకం, డిజైనింగ్ వార్పింగ్, వైన్డింగ్, సైజింగ్ చేసే అందరూ చేనేత కార్మికులకు ఈ పథకం వర్తిస్తుంది.
గత ప్రభుత్వం చేనేత కార్మికులకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ఈ పథకం ప్రవేశపెడితే ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకానికి సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో పథకం అమలు తీరుపై చేనేత కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేనేత కార్మికుల సంక్షేమం, పొదుపు అలవాటు పెంపొందించడం, భవిష్యత్ ఆర్థిక భద్రత కల్పించడం లక్ష్యంగా అమలు చేస్తున్న త్రిఫ్ట్ ఫండ్(చేనేత పొదుపు నిధి) పథకం ప్రస్తుతం నిధుల కొరతతో నిలిచి పోయే పరిస్థితి ఏర్పడడంతో చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో మగ్గంనేసే చేనేత కార్మికులు, వారికి సహాయ పడే అంచుపట్టు(కుట్టుతిప్పే) కార్మికులు 6,566మంది ఉన్నారు.
వీరందరు త్రిఫ్ట్ ఫండ్ చేనేత పొదుపు నిధిలో సభ్యులుగా ఉన్నారు. జిల్లా కేంద్రంలోనే సుమారు 320మంది చేనేత కార్మికులు ఈ పథకంలో సభ్యులుగా చేరి ప్రతి నెలా తమ వాటాను జమ చేస్తున్నా, ప్రభుత్వం చెల్లించాల్సి వాటా మాత్రం ఆర్డీ-2 ఖాతాల్లో జమ కాక పోవడంతో కార్మికులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇప్పటికే ముడి సరుకుల ధరలు పెరిగి, మార్కెటింగ్ సమస్యలు ఎదుర్కొంటున్న, ఉపాధి అవకాశాలు లేక సతమతమవుతున్న నేతన్నలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చేనేత కార్మికులు తమ భవిష్యత్ భద్రత కోసం కష్టపడి పొదుపు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం తన వాటా జమ చేయకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు. కార్మికులు కష్టపడి పొదుపు చేసిన సొమ్ముకు ప్రభుత్వం తన వాటాను జమ చేస్తే ఈ పథకం అసలు లక్ష్యం నేర వేరే అవకాశం ఉంటుందని నేతన్నలు, చేనేత కార్మికులు అంటున్నారు. ప్రభుత్వం, చేనేత మంత్రి, జౌళి చేనేతశాఖ కమిషనర్ స్పందించి త్రిఫ్ట్ నిధులు విడుదల చేసి నేతన్నల ఖాతాల్లో జమ చేయాలని కోరుతున్నారు.
ఈ పథకం ప్రకారం చేనేత కార్మికులు తమ నెల వారి ఆదాయంలో 8శాతం మొత్తాన్ని ఆర్డీ-1 ఖాతాలో జమ చేస్తే, ప్రభుత్వం అదనంగా 16శాతం మొత్తాన్ని ఆర్డీ-2 ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికుల పొదుపు, భవిష్యత్ ఆర్థిక భద్రత కోసం ఈ పథకాన్ని ఫిబ్రవరి 2025 నుంచి రెండేళ్ల కాల పరిమితితో పునఃప్రారంభించింది. అయితే పథకం ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం కేవలం రెండు నెలల వరకు మాత్రమే తన వాటాను ఆర్డీ-2ఖాతాల్లో జమచేసింది. అనంతరం చెల్లించాల్సిన సుమారు 13నెలలు ప్రభుత్వ వాటా ఖాతాల్లో జమ చేయకపోవడంతో అది పెండింగ్లో ఉంది. చేనేత కార్మికులు మాత్రం క్రమం తప్పకుండా తమ వాటాను ఆర్డీ-1 ఖాతాల్లో జమచేస్తున్న ప్రభుత్వం మాత్రం జమచేయడంలేదు. చేనేత వృత్తిలో ఉండి జియోట్యాగింగ్ కలిగి ఉన్న చేనేత, అనుబంధ కార్మికులకు ఈ పథకం వర్తిస్తుంది.
ప్రతి చేనేత కార్మికుడు తాను సంపాదించిన వేతనాల నుంచి ప్రతి నెలా తన వేతనం నుంచి 8శాతం ఆర్డీ-1 ఖాతాకు జమచేయాలి. 8శాతం వేతనాలు జమ అయిన తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే 16శాతం వేతనాలను సంబంధిత ఆర్డీ-2 ఖాతాకు జమ చేస్తారు. చేనేత కార్మికుడు జమ చేసిన ఆర్డీ డబ్బులు 24నెలల తర్వాత తీసుకోవాలి. ప్రస్తుతం ఆ డబ్బులు గత మే నెల నుంచి ప్రస్తుతం వరకు ప్రభుత్వం నేతన్న ఖాతాల్లో జమ చేయలేదు.