అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ( Low-pressure ) క్రమంగా బలపడుతుండడంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ ( India Meteorological Department ) స్పష్టం చేసింది. రాగల 24 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారి ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఈనెల 23వ తేదీ నాటికి ఉత్తర కోస్తాతో పాటు దక్షిణ ఒడిస్సా తీరానికి దగ్గరవుతుందని, దీని వల్ల కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. ఐదు రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. మంగళవారం నుంచి రెండు రోజుల పాటు కోస్తా జిల్లాలకు హై అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అల్లూరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తిరుపతి, అన్నమయ్య, కడప, చిత్తూరు, సత్యసాయి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. మన్యం, విశాఖ, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ జిల్లాలకు మంగళవారం ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.
వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు ప్రభుత్వం అప్రమత్తం
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల మేరకు ప్రభుత్వం అప్రమత్తమయ్యింది . హోం మంత్రి అనిత సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. భారీ వర్షాల కారణంగా వాగులు, కాజ్వేల వద్ద ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ప్రభుత్వం జారీచేసే సూచనలను ప్రజలంతా పాటించాలని సూచించారు.