న్యూఢిల్లీ : నీట్ పరీక్ష లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ సోమవారం పార్లమెంట్ మార్చ్ చేపడుతోంది. వర్షాకాల సమావేశాల నేపథ్యంలో జరుగుతున్న ఈ నిరసన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ‘చలో సంసద్’లో పాల్గొనే వారికి సీజేపీ పార్టీ కీలక సూచనలు చేసింది. ‘చలో సంసద్’లో పాల్గొనే వారు రాజకీయ పార్టీల జెండాలకు బదులుగా జాతీయ జెండాను చేతిలో పట్టుకోవాలి. రాజ్యాంగ ప్రతిని లేదా గాంధీ, అంబేద్కర్, భగత్సింగ్లలో ఎవరో ఒకరి ఫొటోలను తీసుకురావాలి. ర్యాలీలో జై హింద్, భారత్ మాతాకీ జై, ఇంక్విలాబ్ జిందాబాద్, జై భీమ్ లాంటి అనుకూల నినాదాలు చేయాలి. శాంతి యుతంగా, అహింసావాదులుగా మార్చ్‌లో పాల్గొనాలని సీజేపీ తెలిపింది.
కేంద్రం పెద్ద తప్పు చేసింది
సోనమ్ వాంగ్చుక్ను కిడ్నాప్ చేసి కేంద్ర ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందని కాక్రోచ్ జనతా పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ఈ మేరకు ఎక్స్‌లోని సీజేపీ బ్యాకప్ అకౌంట్ సీజేపీ ఈజ్ బ్యాక్‌లో అభిజీత్ దీప్కే వీడియోను పోస్టు చేసింది. ‘నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్చుక్ను కిడ్నాప్ చేసి కేంద్రం పెద్ద తప్పు చేసింది. ఆ తప్పుతో జంతర్‌మంతర్ మొత్తం నిరసనకారులతో నిండిపోతోంది. మీరు మమ్మల్ని అడ్డుకుంటే ఢిల్లీ మొత్తం నిరసనకారులతో నిండిపోతుంది. బీజేపీకి చెందిన 30 నుంచి 40 మంది గూండాలు, ఢిల్లీ పోలీసులు మా నిరసన ప్రదేశంలోకి చొరబడ్డారు. వారంతా దేశ వ్యతిరేక నినాదాలు చేసి ఈ ప్రాంతాన్ని రణరంగంలా మార్చేందుకు కుట్ర చేస్తున్నారు. వారిని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తాం’ అని సీజేపీ వెల్లడించింది.
మార్చ్‌ను విజయవంతం చేయండి..
పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ దవాఖాన నుంచి మొదటి ప్రకటన చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించనున్న పార్లమెంట్ మార్చ్‌లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు సోనమ్ తెల్లకాగితంపై రాసిన నోట్‌ను ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో ఎక్స్‌లో పోస్టు చేశారు. కాగా పార్లమెంట్ మార్చ్‌కు పోలీసులు అనుమతి నిరాకరించినట్టు తెలుస్తోంది.
పార్లమెంట్లో ప్రశ్నిస్తే దీక్ష విరమణ!
కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న వాంగ్‌చుక్ నిరాహార దీక్షను విరమించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన భార్య తెలిపారు. అయితే రాజకీయ పార్టీల నేతలు ఆయనను దవాఖానలో కలిసి విద్యావ్యవస్థ లోపాలపై, నీట్ పేపర్ లీకేజీలపై పార్లమెంట్లో కేంద్రాన్ని ప్రశ్నిస్తామని హామీ ఇస్తేనే దీక్ష విరమిస్తారని ఆమె తెలిపారు.