హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఆనకట్టల భద్రత, మరమ్మతులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. వాటి పునరుద్ధరణ కోసం నిధులను విడుదల చేయడం లేదు. అదేమంటే బడ్జెట్ లేదంటూ బుకాయిస్తున్నది. కనీసం కేంద్రం మంజూరు చేస్తున్న నిధులనూ ఖర్చు చేయడం లేదు. ఏటా కేంద్రం నిధులు మంజూరు చేయడం.. ఆర్థిక సంవత్సరం ముగిసిపోవడంతో ఆ నిధులు మురిగిపోవడం పరిపాటిగా మారింది.
గత రెండేండ్ల నుంచి ఇదే తంతు కొనసాగుతున్నది. అందుకు డ్రిప్ (డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇప్రూవ్‌మెంట్ ప్రోగ్రాం) ఫేజ్-2 పనులే నిలువెత్తు నిదర్శనం. రూ.100 కోట్లు మంజూరైనా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదు. ఇతర రాష్ట్రాలు మాత్రం ఆ నిధులను చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నాయి. ఇటీవల పార్లమెంట్లో కేంద్ర జల్‌శక్తి శాఖ వెల్లడించిన గణాంకాలు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలకు అద్ధం పడుతున్నాయి.
‘డ్రిప్’ కింద ప్రపంచ బ్యాంకు నిధులతో దేశవ్యాప్తంగా 736 డ్యామ్‌లను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. అందుకోసం రూ.10,211 కోట్లు ఖర్చు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. వాటిలో తెలంగాణ నుంచి ఫేజ్-2 కింద 20, ఫేజ్-3 కింద 9 ప్రధాన డ్యామ్‌లను పునరుద్ధరణకు ఎంపిక చేసింది. అందుకు రూ.645.13 కోట్లు ఖర్చవుతుందని లెకలు వేసింది. రాష్ట్రం నుంచి ఎంపిక చేసిన వాటిలో పాకాల లేక్, లక్నవరం, రామప్ప లేక్, ఉస్మాన్‌సాగర్, పోచారం, హిమాయత్‌సాగర్, పాలేరు రిజర్వాయర్, నిజాంసాగర్, డిండి, కోయిల్‌సాగర్, కడెం, మూసీ, నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ, స్వర్ణ, ఎల్ఎండీ,
మల్లూరువాగు, బొగ్గుల వాగు, ఎన్టీఆర్సాగర్, జూరాల, కౌలాస్‌నాలా, సాత్నాలా, సింగూరు, ఎల్లంపల్లి, వట్టివాగు, గడ్డెన్నవాగు, అకంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పెద్దవులపల్లి రిజర్వాయర్ , పీపీఆర్ రావు, సింగూరు ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి పునరుద్ధరణ పనులను 2031 నాటికి పూర్తిచేయాల్సి ఉండగా ఇప్పటికీ ఒక్క ప్రాజెక్టు పనులను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేదు. ఆ ప్రాజెక్టుల రిపోర్టులను కేంద్రానికి నిర్ణీత నమూనాలో సమర్పించి, అవసరమైన అనుమతులు తీసుకోవాలి. అనంతరం టెండర్లను పూర్తిచేసి పనులను చేపట్టాలి. కానీ కాంగ్రెస్ సర్కార్ ‘డ్రిప్’ అమలును కాగితాలకే పరిమితం చేసి, పూర్తిగా అటకెక్కించింది.
‘డ్రిప్’ అమలుకు కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నిధుల నుంచి 70% రుణంగా ఇస్తుంది. మిగిలిన 30% నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆ లెక్కన ప్రస్తుతం తెలంగాణలోని 29 ప్రాజెక్టుల పునరుద్ధరణకు అవసరమయ్యే రూ. 645.13 కోట్లలో రూ.193 కోట్లు రాష్ట్ర ప్రభు త్వం సమకూర్చాలి. మిగతా రూ. 452.13 కోట్లను ప్రపంచబ్యాంకు రుణం ద్వారా కేంద్రం సమకూరుస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే రూ.100 కోట్లు మంజూరు చేసింది. ‘డ్రిప్’ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది (2025-26) బడ్జెట్లో రూ.45 కోట్లు కేటాయించింది. కానీ, ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. దీంతో ఎప్పటి మాదిరిగానే ఈ ఏడాది కూడా కేంద్ర నిధులు మురిగిపోనున్నాయి.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ‘డ్రిప్’ను అమలు చేయకుండా ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) విభాగం ద్వారా డ్యామ్‌ల మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపడుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు ‘డ్రిప్’ ద్వారా రూ.63.48 కోట్లు మంజూరయ్యాయి. వాటితో కట్టను పటిష్టం చేయడం, జంగిల్ క్లియరెన్స్, ప్రధాన కాలువల మరమ్మతులు, ఫిజోమీటర్ల పునరుద్ధరణ తదితర పనులను నిర్వర్తించాల్సి ఉన్నది.
రివిట్మెంట్ దెబ్బతింటున్నదని ప్రాజెక్టు అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయినప్పటికీ ‘డ్రిప్’ ద్వారా ఆ పనులు చేపట్టకుండా మీనమేషాలు లెక్కిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఓఅండ్ఎం ద్వారా ఆయా పనులు చేపట్టేందుకు సిద్ధమైంది. అందుకోసం రూ.18 కోట్లు మంజూరు చేసింది. దీంతో కేంద్ర నిధులను ఎందుకు వినియోగించుకోవడం లేదని ఇరిగేషన్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
