జయశంకర్ భూపాలపల్లి, జూలై 27 (నమస్తే తెలంగాణ)/హనుమకొండ : అనేక ఏళ్ల పాటు చిన్నారులకు అమ్మలా అన్నంపెట్టి.. అక్షరాలు నేర్పించి.. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించి.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు.. ఉద్యోగ విరమణ అనంతరం కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిటైర్మెంట్ తీసుకొని రెండేళ్లు గడుస్తున్నా రావాల్సిన బెనిఫిట్స్ అందకపోవడంతో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అంతేకాక వివిధ కారణాలతో మరణిస్తే ఆ కుటుంబాలకు అంత్యక్రియల నిమిత్తం ఇచ్చే రూ. 20 వేల సాయం కూడా అందడం లేదని వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 65 ఏండ్లు నిండిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను విధుల నుంచి తప్పిస్తున్నది. 2024 జూన్ నెల నుంచి ఈ ప్రక్రియను పక్కాగా అమలు చేస్తున్నది.
వయస్సు ఆధారంగా వారిని తొలగిస్తున్న ప్రభుత్వం మాత్రం ప్రయోజనాలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఉద్యోగాలు పోయి, అనారోగ్యాల బారిన పడుతున్నా కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంగన్వాడీల విరమణ బెనిఫిట్స్ కింద టీచర్‌కు రూ.లక్ష, హెల్పర్‌కు రూ. 50 వేలు, మరణిస్తే అంత్యక్రియలకు రూ. 10 వేల చొప్పున చెల్లిస్తామని ఉత్తర్వులు జారీ చేసింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు జూన్ 2024 నుంచి రిటైర్మెంట్ అమలు చేస్తున్న క్రమంలో బెనిఫిట్స్‌గా అంగన్వాడీ టీచర్‌కు రూ.రెండు లక్షలు, హెల్పర్‌కు రూ.లక్ష, అంత్యక్రియలకు రూ. 20వేల చొప్పున చెల్లిస్తామని 2025లో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రివైజ్డ్ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వం వాటి అమలును మరిచింది.
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు తెలిపిన ప్రాథమిక సమాచారం మేరకు 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు 120 మంది అంగన్వాడీ టీచర్లు, 390 మంది ఆయాలతో కలిపి మొత్తం 510 మంది ఉద్యోగ విరమణ పొందారు. వీరిలో హనుమకొండ జిల్లాలో 29 మంది టీచర్లు, 97 మంది హెల్పర్లు, వరంగల్‌లో 34 మంది టీచర్లు, 108 మంది హెల్పర్లు, మహబూబాబాద్ జిల్లాలో19 మంది టీచర్లు, 24 మంది ఆయాలు, ములుగు జిల్లాలో 9 మంది టీచర్లు, 19 మంది ఆయాలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 24 మంది టీచర్లు, 47 మంది ఆయాలు, జనగామ జిల్లాలో ఐదుగురు టీచర్లు, 95 మంది హెల్పర్లు రిటైర్ అయ్యారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీరికి అందాల్సిన బెనిఫిట్స్ రెండేళ్లుగా అందకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురొంటున్నారు. వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు, కుటుంబ అవసరాలు, అప్పుల భారంతో ఇబ్బంది పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా జిల్లా మహిళ, శిశు సంక్షేమ శాఖ, ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా స్పష్టమైన సమాధానం లభించడం లేదని వాపోతున్నారు. పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా, ప్రజా ప్రతినిధులను కలిసి సమస్య వివరించినా ఎలాంటి పరిషారం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగ విరమణ పొందిన తర్వాత బెనిఫిట్స్‌తో పాటు నెలవారీ పింఛన్ అందుతుందనే సంతోషం లేకుండా పోయిందంటున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఎన్నో హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే విరమణ పొందిన వారి వివరాలను ప్రభుత్వానికి నివేదించామని ఆయా జిల్లాల ఐసీడీఎస్ అధికారులు తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అందిస్తామన్న బెనిఫిట్స్‌ను పెంచి ఇస్తామన్న మంత్రి సీతక్క హామీ రెండేండ్లు గడుస్తున్నా అమలుకు నోచుకోవడం లేదు. ఇందుకు సంబంధించిన జీవో ఇప్పటికీ విడుదల కాలేదు. కొత్తగా తీసుకున్న నిర్ణయం మేరకు రిటైరైన అంగన్వాడీ టీచర్లకు రూ. 2 లక్షలు, ఆయాలకు రూ.1 లక్ష అందించాల్సి ఉంది. ఇప్పటికైనా సీతక్క తన హామీని నిలబెట్టుకోవాలని ఉద్యోగ విరమణ పొందిన టీచర్లు, ఆయాలు కోరుతున్నారు.