హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని బడుల్లో ఇంకా బాలికల టాయిలెట్ల కొరత సమస్య పట్టిపీడిస్తున్నది. ప్రత్యేకించి సర్కార్ బడుల్లో ఈ సమస్య అధికంగా ఉన్నది. మొత్తం స్కూళ్లల్లో ఐదు శాతం బడుల్లో బాలికలకు ప్రత్యేకంగా టాయిలెట్లు లేవు. ఈ విషయాన్ని కేంద్రం సోమవారం పార్లమెంట్లో వెల్లడించింది. దాదాపు 1,300పై చిలుకు బడుల్లో బాలికలకు బడుల్లో ప్రత్యేకంగా టాయిలెట్లు లేవని కేంద్రం వెల్లడించింది.
రాష్ట్రంలో సెకండరీవిద్యలో బాలికలు డ్రాపౌట్ రేటు ఆందోళన కలిగిస్తున్నది. డ్రాపౌట్ రేట్ ప్రాథమిక స్థాయిలో జీరో ఉండగా, ఉన్నత స్థాయికి వచ్చేసరికి క్రమంగా పెరుగుతున్నది. అంటే అమ్మాయిలు 8వ తరగతి వరకే పరిమితమవుతున్నారు. 9,10 తరగతులు పూర్తిచేయడం లేదన్న మాట. 2025-26 విద్యాసంవత్సరంలో సెకండరీ విద్యలో బాలికల డ్రాపౌట్రేట్ జాతీయ సగటు 8% ఉండగా, తెలంగాణలో 4.3శాతంగా ఉన్నట్టు కేంద్రం పార్లమెంట్లో వెల్లడించింది.
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ) : ఐఐఎంలోని మేనేజ్మెంట్ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్) 2026 నోటిఫికేషన్ విడుదలయ్యింది. నవంబర్ 29న రాత పరీక్ష నిర్వహిస్తారు. ఫలితాలు 2027 జనవరి మొదటి వారంలో విడుదలవుతాయి. ఈ పరీక్షకు హాజరయ్యేవారు ఆగస్టు 3 ఉదయం 10గంటల నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 15 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుకు తుది గడువు. అడ్మిట్‌కార్డులు నవంబర్ 4న విడుదలవుతాయి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు, ఫలితాల కోసం వేచిచూస్తున్నవారు కూడా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.