ACB Rides | భీమిని: భీమిని మండలంలోని పెద్దపేట గ్రామ పరిపాలనా అధికారి (GPO) దుర్గాప్రసాద్‌ను రూ. 80,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ (ACB) ఆదిలాబాద్ రేంజ్ విభాగం అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. భూమిన తన పేరుమీదుగా బదిలీ చేసి పట్టా పాస్‌బుక్ ఇప్పించాలని జీపీవో దుర్గాప్రసాద్‌ను బాధితుడు కోరాడు. ఇందుకు రూ. 1,30,000 డిమాండ్ చేశాడు. మొదటి విడతగా రూ. 80,000, పని అయిపోయిన తరువాత మిగతా రూ. 50,000 చెల్లించాలని సూచించాడు.
దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బిట్టుపల్లికి చెందిన పోతు రాజేందర్ (33 ఏండ్లు) స్కూటర్‌పై వచ్చిన జీపీవో అధికారి మొదటి విడత డబ్బులను అతడికి ఇవ్వాలని సూచించాడు. దీంతో బాధితుడు డబ్బులను రాజేందర్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి లంచం డిమాండ్ చేసినందుకు జీపీవో దుర్గా ప్రసాద్‌ను, అతడికి సహకరించిన పోతు రాజేందర్‌ను అరెస్ట్ చేశారు. వీరిని కరీంనగర్‌లోని SPE & ACB కోర్టులో హాజరపరచనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా బాధితుడు పేరును వెల్లడించడం లేదని ఏసీబీ అధికారులు వెల్లడించారు.
అలాగే ఎవరైనా అధికారులు లంచం అడిగితే టోల్‌ఫ్రీ నంబర్ 1064ను లేదా 9440446106 నంబర్‌ను వాట్సాప్ ద్వారా సంప్రదించాలని ఏసీబీ అధికారులు సూచించారు. తెలంగాణ ఏసీబీ పేరుతో ఉన్న ట్విట్టర్, ఫేస్బుక్ అకౌంట్లలో సంప్రదించాలని కోరారు.