Sleeping | ఈ రోజుల్లో చాలామంది యువత రాత్రివేళల్లో ఎక్కువసేపు మేల్కొని ఉండడం, మధ్యాహ్నం వరకు నిద్రపోవడం, సాయంత్రం లేదా రాత్రి వ్యాయామం చేయడం వంటి జీవనశైలికి అలవాటు పడుతున్నారు. బయటకు చూస్తే ఇది సాధారణ అలవాటుగానే అనిపించినప్పటికీ, శరీరంలోని సహజ జీవ గడియారంపై దీని ప్రభావం పడుతుంది. నిద్ర, మెళకువ, హార్మోన్ల విడుదల, ఏకాగ్రత వంటి అనేక ప్రక్రియలను నియంత్రించే అంతర్గత గడియారం వెలుతురు, శారీరక చురుకుదనం, రోజువారీ అలవాట్ల ఆధారంగా పనిచేస్తుంది. నిద్ర, మెళకువ సమయాలు పదేపదే మారిపోతే ఈ గడియారం కూడా గాడి తప్పే అవకాశం ఉంటుంది.
ప్రతిరోజూ మధ్యాహ్నం నిద్రలేచే అలవాటు ఉంటే శరీరం ఆ సమయాన్నే ఉదయంగా భావించే పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల ఏకాగ్రతకు అనుకూలమైన సమయాలు మారిపోవడంతో చదువులు, పని, సమావేశాలు వంటి రోజువారీ కార్యకలాపాలపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా రాత్రి ఆలస్యంగా వ్యాయామం చేయడం సమస్యను మరింత పెంచుతాయి. వ్యాయామం వల్ల శరీర ఉష్ణోగ్రత, చురుకుదనం పెరుగుతాయి. నిద్రకు కొద్ది గంటల ముందు తీవ్రమైన వ్యాయామం చేస్తే శరీరం వెంటనే విశ్రాంతి స్థితిలోకి వెళ్లలేదు. దీంతో నిద్ర ఆలస్యమై, మరుసటి రోజు మేల్కొనే సమయం కూడా వెనక్కి వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ చక్రం కొనసాగితే ఏకాగ్రత తగ్గడం, సంభాషణల సమయంలో దృష్టి నిలపలేకపోవడం, చదివిన విషయాన్ని సరిగ్గా గ్రహించలేకపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి.
ఈ పరిస్థితిని సరిచేసుకోవడానికి జీవ గడియారానికి అనుగుణంగా రోజువారీ అలవాట్లను మార్చుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. నిద్రలేచిన తర్వాత మొదటి గంట లేదా రెండు గంటల్లో సహజమైన పగటి వెలుతురులో కొంత సమయం గడపడం శరీర గడియారాన్ని క్రమబద్ధం చేయడంలో సహాయపడుతుంది. వీలైనంత వరకు వ్యాయామాన్ని రోజులో ముందుగానే పూర్తి చేయడం, నిద్రకు కనీసం మూడు గంటల ముందు తీవ్రమైన వ్యాయామాన్ని ముగించడం మంచిది. రాత్రి సమయం దగ్గరపడే కొద్దీ కాంతిని తగ్గించడం, ఫోన్ వినియోగాన్ని తగ్గించడం, అధిక ఉద్దీపన కలిగించే కార్యకలాపాలకు దూరంగా ఉండడం కూడా నిద్రకు శరీరాన్ని సిద్ధం చేయడంలో సహాయపడతాయి.
సమయానికి నిద్రపోయే ప్రయత్నం చేసినప్పటికీ ఏకాగ్రత లోపించడం, మానసిక స్థితి తగ్గడం లేదా నిరంతరం అలసటగా అనిపించడం కొనసాగితే దాన్ని సాధారణ జీవనశైలిలో భాగంగా నిర్లక్ష్యం చేయకూడదు. శరీర గడియారం సరిగా పనిచేయకపోవడం కూడా ఇందుకు ఒక కారణం అవుతుంది. ముఖ్యంగా యువతలో నిద్ర, వ్యాయామం, పగటి వెలుతురు వంటి అంశాలకు సరైన సమయాన్ని కేటాయించడం మెదడు పనితీరుకు ఉపయోగపడుతుంది. పగలు–రాత్రి సహజ క్రమానికి శరీర గడియారాన్ని అనుసంధానం చేయడం ఏకాగ్రత, మానసిక ఆరోగ్యం, దీర్ఘకాలిక మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలకంగా మారతాయని నిపుణులు చెబుతున్నారు.