జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ) : భూపాలపల్లిలో కాంగ్రెస్కు గడ్డు పరిస్థితి ఉందని తెలిసిన సీఎం ఇక్కడ ఎన్నికల సభ నిర్వహించినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎదురీత తప్పలేదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో నైతిక విజయం బీఆర్ఎస్దేనని చెప్పారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి వార్డులోనూ బీఆర్ఎస్ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారని, కొన్ని స్థానాల్లో అతి తక్కువ ఓట్లతో ఓటమి పాలయ్యారన్నారు. దీంతో తాము నాలుగు స్థానాలు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. మొత్తం మీద చూస్తే కేవలం రెండు శాతం ఓట్లతో మాత్రమే కాంగ్రెస్ ముందంజలో ఉందని, ప్రతిపక్షంలోనూ తాము అధికార పార్టీకి చుక్కలు చూపించామన్నారు.
ఎన్నడూ లేని విధంగా ఓటమి భయంతో కాంగ్రెస్ అభ్యర్థు లు కాళ్లు మొక్కే సంస్కృతికి తెరలేపారని, అయినా బీఆర్ఎస్కు గణనీయమైన మెజార్టీ ఇచ్చారని అన్నారు. ధన ప్రవాహం, అధికార దుర్వినియోగంతో తమ ఉనికి చాటుకున్నారని విమర్శించారు. సింగరేణి కార్మికులు సైతం టీబీజీకేఎస్ అభ్యర్థులకు పట్టం కట్టార ని, భూపాలపల్లిలో ఇంత పెద్ద ఎత్తున ఓట్ల శాతం ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉంటామని, రాబోయే కాలంలో ప్రభుత్వ వైఫల్యాలను, 420 హామీల అమలుపై నిలదీస్తామని అన్నారు. కార్యకర్తలు, నాయకులు అధైర్య పడొద్దని, రోజు రోజుకు ప్రజల్లో బీఆర్ఎస్పై అభిమానం పెరుగుతున్నదని, శ్రేణులకు పార్టీ అండగా ఉంటుందని గండ్ర భరోసా ఇచ్చారు.