హైదరాబాద్, ఫిబ్రవరి 14(నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కని మున్సిపాలిటీలపై బీఆర్ఎస్ గురిపెట్టింది. ఆయా చోట్ల అత్యధిక పురపాలికలను కైవసం చేసుకొనే దిశ గా పార్టీ అడుగులు వేస్తున్నది. బీఆర్ఎస్ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించిన మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఆ పార్టీ చెంతకు పలువురు స్వతంత్ర అభ్యర్థులు దరిచేరారు. కొన్నిచోట్ల బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కౌన్సిలర్లు కూడా బీఆర్ఎస్ వైపు నిలిచేందుకు నిర్ణయించుకున్నారు. మరికొందరు పార్టీలో అధికారికంగా చేరకున్నా మద్దతు ప్రకటించారు. ఇలా పలువురు తమ సంపూర్ణ మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చా రు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 36 చోట్ల హంగ్ ఏర్పడింది. కొన్నిచోట్ల ఎక్స్ ఆఫీషియో సభ్యుల ఓట్లతో గెలుచుకొనేందుకు పావులు కదుపుతున్నది.
ఈ నేపథ్యంలో శనివారం బెల్లంపల్లి మున్సిపాలిటీ 30వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ శంకర్‌సింగ్, కాంగ్రెస్ పార్టీకి చెందిన 26వ వార్డు కౌన్సిలర్ కుమారస్వామి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీకి చెందిన 34వ వార్డు కౌన్సిలర్ రామ్మూర్తి బీఆర్ఎస్ పార్టీకే మద్దతు తెలిపారు. బెల్లంపల్లిలో 34 వార్డులకు బీఆర్ఎస్, కాంగ్రెస్ చెరో 14 చోట్ల గెలుపొందాయి. బీజేపీ 2, ఇతరులు 4 స్థానాలు దక్కించుకొన్నారు. మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలంటే బీఆర్ఎస్కు నలుగురి మద్దతు అవసరం కాగా, ఇప్పటికే ముగ్గురు కారు పార్టీ వైపు నిలిచారు. మరొకరు మద్దతు తెలిపితే సునాయాసంగా బెల్లంపల్లి మున్సిపల్ పాలకవర్గాన్ని గెలిచే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో హంగ్ ఏర్పడిన చోట్ల బీఆర్ఎస్ను వరించే మున్సిపాలిటీలు ఈ కింది విధంగా ఉన్నాయి.
గులాబీ జెండా ఎగిరే మున్సిపాలిటీలు ఇవే?

బీఆర్ఎస్లోకి ఇండిపెండెంట్ కౌన్సిలర్లు పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యేలు
ఆయా మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్ కౌన్సిలర్లుగా ఎన్నికైన పలువురు బీఆర్ఎస్లో చేరారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లోని పదో వార్డు కౌన్సిలర్‌గా గెలిచిన రాహుల్‌రెడ్డి, ఇంద్రేశం మున్సిపాలిటీలో 2వ వార్డులో గెలిచిన కౌన్సిలర్ లావణ్య శనివారం బీఆర్ఎస్ గూటికి చేరారు. వీరికి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి గులాబీ కుండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మాట్లాడుతూ.. ఇస్నాపూర్, ఇంద్రేశం మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని అన్నారు. నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతున్నదని చెప్పారు. కేసీఆర్‌పై అభిమానంతో కౌన్సిలర్లు బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. కాగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ 17వ వార్డు కౌన్సిలర్ ఎండీ చాంద్‌మియా బీఆర్ఎస్లో చేరారు. శనివారం బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో చాంద్‌మియా గులాబీ గూటికి చేరారు. ఈయనకు బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి కౌన్సిలర్‌గా గెలిచారు. శనివారం ఆయన సొంత పార్టీలోకి తిరిగి వచ్చినందుకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.