రామగిరి, ఆగస్టు 3: ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్స్(టీచర్), ఆయా పోస్టుల నియామకా ల్లో అర్హులైన వారికి పొద్దున్నే నియామక పత్రాలు అందజేసిన విద్యాశాఖ అధికారులు మధ్యాహ్నం వారి ని పిలిచి మరీ పత్రాలు గుంజుకున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగాలు పొందిన వారు అయోమయంలో పడిపోయారు. అధికారులను కారణమడిగితే డీఈవో నుంచి వచ్చిన మేసేజ్ మేరకే వెనక్కి తీసుకున్నట్లు చెప్ప డం గమనార్హం. అయితే ఈ నియామకాల్లో అధికార పార్టీ నేతలకు సంబంధించిన వ్యక్తులకు ఉద్యోగాలు రాలేదని తెలిసింది. వారి ఒత్తిడిమేరకే విద్యాశాఖ అధికారులు నియామక పత్రాలు వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. విద్యాశాఖలో అధికార పార్టీ ఒత్తిళ్లు, నేతల పెత్తనం కారణంగానే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పలు మండలాల పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించేందుకు 2026-27 విద్యా సంవత్సరంలో 124 పాఠశాలలకు సంబంధించి ప్రభుత్వం, విద్యాశాఖ అనుమతులు జారీ చేసిన విషయం విదితమే. అయితే అందుకు సంబంధించి అర్హులై వారి నుంచి ఆయా మండలాల్లో డీఈవో ఆదేశాలతో ఇన్స్ట్రక్టర్స్(టీచర్స్), ఆయా పోస్టులకు వేర్వేరుగా ఎంఈవోలు దరఖాస్తులు స్వీకరించారు. వాటిని డీఈవోకు పంపగా, నిబంధనల మేరకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా, నియామక పత్రాలను శనివారం ఎంఈవోలకు పంపించారు. దీంతో ఎంఈవోలు ఎంపికైన అభ్యర్థులకు సమాచారం ఇచ్చి సోమవారం ఉద యం ఎంఈవో కార్యాలయంలో అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించి డీఈ వో కార్యాలయం, సమగ్రశిక్ష నుంచి నుంచి వచ్చిన నియామక పత్రాలు అందచేశారు.
ఉద్యోగం రావడంతో అభ్యర్థులు ఆనందంతో వెంటనే తమకు కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో చేరారు. అయితే ఈ ఆనందం కొద్ది గంటల్లోనే అవిరైపోయింది. తిరిగి మధ్యా హ్నం 2గంటల సమయంలో డీఈవో నుంచి ఎంఈవోలకు వచ్చిన మెసేజ్‌తో పరిస్థితి తలకిందులైంది. ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, విద్యాశాఖ వైఫల్యానికి దర్పణమని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ, సర్కార్ బడిలో రాజకీయాలా అంటూ కన్నీటి పర్యంతమమైన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది.
అభ్యర్థుల ఆవేదన.. వెల్లువెత్తున్న విమర్శలు
నోటిఫికేషన్లో ఇచ్చిన అర్హతలతో న్యాయబద్ధంగా వచ్చిన ఉద్యోగాలను ఇలా అర్ధాంతరంగా వెనక్కి తీసుకోవడంపై ఎంపికైన అభ్యర్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులను నిలదీస్తే.. ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చాయని, తమ చేతుల్లో ఏమీ లేదని ఎంఈవోలు చేతులెత్తేసినట్లు అభ్యర్థులు చెబుతున్నారు. అర్హులైన నిరుద్యోగులను కాదని, అధికార పార్టీ నాయకులు సిఫార్శు చేసిన వ్యక్తులకే ఆ పోస్టులు కట్టబెట్టేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.
కాంగ్రెస్ ప్రభు త్వ హయాంలో విద్యాశాఖ వైఫల్యాలకు, అధికారుల అనాలోచిత నిర్ణయాలకు ఈ ఘటనే తార్కాణమని విపక్షాలు, నిరుద్యోగ, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. అసలు ఉదయం నియామక పత్రాలు ఎందుకు ఇచ్చా రు..? మధ్యాహ్నానికి ఎం దుకు వెనక్కి తీసుకోవాల్సి వచ్చిం ది..? అనే ప్రశ్నలకు విద్యాశాఖ నుంచి ఎలాంటి స్పష్టతా లేదు. అర్హుల పొట్టకొట్టేలా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ మొత్తం వివాదంపై వివరణ కోరేందుకు నల్లగొండ జిల్లా డీఈవో పి.సుశీంద్రరావును ‘నమస్తే తెలంగాణ’ ఫోన్ ద్వారా పలుమార్లు సంద్రించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన స్పందించ లేదు. ఫోన్ లిఫ్ట్ చేయకుండా మౌనం దాల్చడం అధికారుల తీరుపై మరింత అనుమానాలకు తావిస్తోంది.