కోరుట్ల : ఉపాధి హామీ పథకంలో పనులు నిర్వహిస్తున్న సిబ్బందికి జీతాలు రాక జీవితాలు సాగక పోవడంతో ఉపాధి హామీ సిబ్బంది అప్పుల పాలవుతున్నారు. నాలుగు నెలలైనా జీతం అందకపోవడంతో కుటుంబం గడవడానికి అప్పులు చేయాల్సి వస్తుందని జిల్లా అధికారులు చొరవ తీసుకొని జీతాలను సకాలంలో ఇప్పించి తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నారు. జగిత్యాల జిల్లాలో సుమారు 20026 మంది ఉపాధి హామీ ఫీల్డ్ ఆఫీసర్లతో పాటు సిబ్బందికి జీతాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలలు పునః ప్రారంభమవడంతో పిల్లల స్కూల్ ఫీజులు, నిత్యావసర సరుకులకు సైతం అప్పులు చేయాల్సి పరిస్థితితులు తలెత్తడంతో ఇబ్బంది పడుతున్రనారు. కాగా జిల్లాలో ఉపాధి పనులు నిర్వహించే క్షేత్ర సాంకేతిక సహాయకులతో పాటు ఏపీఓ, పిఓ లకు సైతం జీతాలు నాలుగు నుంచి అందలేవని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
యాప్‌లో వివరాలు నమోదు చేయడంలో అధికారుల జాప్యం..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేసే పథకాల కింద విడుదలయ్యే నిధులను పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉమ్మడి పథకాల సిఎస్ ఎన్ నిధుల వినియోగంలో పారదర్శకత, మరింత బాధ్యతను పెంచేందుకు స్పర్శ అనే నూతన డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ లో సిబ్బంది వివరాల నమోదులో జాప్యం చేయడంతో వేతనాల చెల్లింపు పై ప్రభావం చూపుతోందని అధికారులు చెబుతున్నారు. సాంకేతిక సమస్యలను అధికారులు పరిష్కరించకపోవడంతో సిబ్బంది జీతాల చెల్లింపులో జాప్యం కొనసాగుతోంది.
చొరవ తీసుకుంటే సకాలంలో జీతాలు..
ప్రతి ఏటా జీతాలు చెల్లించడంలో జాప్యం జరుగుతున్నదని ఉన్నతాధికారులకు విన్నవిస్తే, రాష్ట్రస్థాయిలో యాప్‌కు సంబంధించిన సాంకేతికత లోపం అని చెప్పడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉపాధి కూలీల్లో ఉంది. గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు చొరవ తీసుకొని యాప్‌లో నెలకొన్న సాంకేతిక సమస్యను పరిష్కరిస్తేనే సిబ్బందికి సకాలంలో జీతాలు అందే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ఉపాధి హమీ సిబ్బంది కోరుతున్నారు.