పెగడపల్లి: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. పెగడపల్లి మండలం ఐతుపల్లిలో తాగిన మైకంలో అన్నను తమ్ముడు కర్రతో కొట్టిచంపాడు.
పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐతుపల్లి గ్రామానికి చెందిన కూన నరసయ్య, రాములు అన్నదమ్ములు. వీరి మధ్య కొంతకాలంగా భూవివాదాలు నడుస్తున్నాయి. పలుమార్లు గొడవలు కూడా జరిగాయి.ఈ క్రమంలో పెద్దమ్మ బోనాల సందర్భంగా గురువారం రాత్రి ఇద్దరు అన్నదమ్ములు అతిగా మద్యం సాగించారు. తాగిన తర్వాత ఇద్దరూ పాత గొడవలను గుర్తుచేసుకుంటూ గొడవలకు దిగారు. ఆ ఆవేశంలో తమ్ముడు రాములు కర్రతో నరసయ్యను గట్టిగా కొట్టాడు. తలకు తీవ్రగాయం కావడంతో నరసయ్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. పంచనామా చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు నరసయ్య భార్య రాజవ్వ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు.