రాయికల్, జులై 29 : ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పిఆర్టియు టిఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు బోయినపల్లి ఆనందరావు అన్నారు. రాయికల్ మండలం సింగరావుపేట బీసి గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయ సమస్యలు తెలుసుకొని సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ గురుకుల పాఠశాల, మోడల్ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 010 పద్దు కింద వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు.
హెల్త్ స్కీమ్ వర్తించే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు. గురుకుల పాఠశాల పని వేళల మార్పునకు ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు శ్రీపాల్ రెడ్డి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారని, త్వరలోనే ఉత్తర్వులు వస్తాయాన్నారు. కేజీబీవీ ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్ వర్తించే విధంగా పిఆర్టియు టిఎస్ కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పొన్నం రమేష్, బొమ్మకంటి రవి కుమార్, రాష్ట్ర కార్యదర్శి జాదవ్ వసంత రావు, మండల అధ్యక్షులు అంతడుపుల గంగారాజం, ప్రధాన కార్యదర్శి రాపర్తి నర్సయ్య పాల్గొన్నారు.