జగిత్యాల : జిల్లాలోని వెల్గటూర్ మండలం కిషన్ రావు పేట స్టేజి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు. జగిత్యాల జిల్లా కొండగట్టుకు వచ్చిన పవన్ కళ్యాణ్‌ను చూసేందుకు వచ్చిన అభిమానులు తిరిగి వెళ్తుండగా వెల్గటూర్ మండలంలోని కిషన్ రావు పేట స్టేజి వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటనలో ముక్కట్రావు పేరు గ్రామానికి చెందిన రాజ్ కుమార్ మరణించగా కరీంనగర్ సివిల్ ఆస్పత్రిలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అదేవిధంగా ఈ ఘటనలో గాయపడ్డ కిషన్ రావు పేట గ్రామానికి చెందిన బొలిశెట్టి శ్రీనివాస్, కుమ్మరి పెల్లి గ్రామానికి చెందిన జక్కుల అంజి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిని మంత్రి పరామర్శించి వైద్యులతో మాట్లాడారు.
వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు, మంత్రి వెంట మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏలేటి కృష్ణారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గూడ రాంరెడ్డి ఉన్నారు.