పెగడపల్లి: వానకాలం పంటకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపడతామని పెగడపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములుగౌడ్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ కమిటీ పాలక వర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ రాములుగౌడ్ మాట్లాడుతూ మండలంలో రైతులు పండించే వరి పంటకు కొనుగోలుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అధికారులు, నిర్వాహకులతో ముందస్తు ఏర్పాట్లు చేపట్టనున్నట్లు తెలిపారు.
రైతులు పండించే ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ధాన్యం సేకరిస్తామని వివరించారు. దీంతో పాటు వ్యవసాయ మార్కెట్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు పాలక వర్గం తీర్మానించిందని, నిధుల మంజూరు మేరకు వివిధ రకాల అభివృద్ధి పనులు చేపడతామని రాములుగౌడ్ వివరించారు. ఈ కార్యక్రమంలో నందగిరి సింగిల్ విండో చైర్మన్ కర్ర భాస్కర్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, ఏడీఏ రాంచందర్, మార్కెట్ కార్యదర్శి వరలక్ష్మి. వైస్ చైర్మన్ సురకంటి సత్తిరెడ్డి, డైరెక్టర్లు భాస్కర్, కిషన్, శ్రీకాంత్ రెడ్డి, మల్లయ్య, అంజయ్య, మహేష్, తిరుపతి, లక్ష్మిరాజం, శ్రీనివాస్, గంగరాజు, అంజీనాయక్, లావణ్య తదితరులున్నారు.