తిమ్మాపూర్, మార్చి9: తరాలు మారుతున్నా కొద్దీ కొత్త తరాలకు గొప్ప వారి జీవితాలు, వారి త్యాగాలు, వారు చేసిన పనులు ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశ్యంతో వారి అభిమానులు, సంఘాల ఆధ్వర్యంలో మహనీయుల విగ్రహాలు(statues) ప్రతిష్టిస్తారు. కానీ తిమ్మాపూర్లో ఏర్పాటు చేసి ప్రతిష్టించడానికి సిద్ధంగా ఉన్న మహానీయుల విగ్రహాలు ఆర్టీసీ వర్సెస్ విగ్రహాల ఆవిష్కరణ జేఏసీ నడుమ ముసుగులు తొడిగే ఉండిపోతున్నాయి. ఈ క్రమంలో అధికారుల తీరుతో విసిగిపోయిన జేఏసీ నాయకులు సోమవారం నుండి రిలే నిరాహారదీక్షలకు దిగుతుంన్నట్లు ప్రకటించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో విగ్రహాల ఏర్పాటు ఖర్చుతో కూడున్నది. కానీ రెండేండ్ల కింద మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సహకారంతో దళిత సంఘాల ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ముందు ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్రాం విగ్రహాలను ఏర్పాటు చేశారు. మరో రెండు రోజుల్లో ఆవిష్కరణ జరగబోతుండగా.. ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్ ఆదేశాలతో ఆ విగ్రహాలు ఏర్పాటు చేసిన స్థలం ఆర్టీసీదంటూ నిలిపేశారు. అప్పటి నుండి మధ్య మధ్యలో రెండు, మూడు సార్లు దళిత సంఘాల నాయకులు ఆవిష్కరించేందుకు ప్రయత్నించినప్పటికీ ఆర్టీసీ బలగాలు, స్థానిక పోలీసులు భగ్నం చేశారు.
ఇటీవల కొన్ని రోజుల కింద ఏకంగా విగ్రహాల ఆవిష్కరణ కోసం మండలంలోని అన్ని పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో జేఏసీని ఏర్పాటు చేశారు. పలు దఫాలుగా అధికారులు, ప్రజాప్రతినిధులను, రాష్ట్ర స్థాయిలో అధికారులను ఈ జేఏసీ నాయకులు కలిసినా ఫలితం లేకపోవడంతో సోమవారం నుండి రిలే నిరాహార దీక్షలకు దిగనున్నట్లు ప్రకటించారు.
ఆవిష్కరణ జరిగేదాక దీక్షలు..
రెండేళ్ల నుండి ఆవిష్కరణ కోసం వినతులు ఇస్తూ వస్తున్న జేఏసీ కమిటీ కన్వీనర్లు దుండ్ర రాజయ్య, మాతంగి శంకర్, సుగుర్తి జగదీశ్వరాచారి, వంతడుపుతల సంపత్తో పాటు నాయకులు ఈ సారి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఆవిష్కరణ జరిగేదాక దీక్షలు కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. తామేమీ ఆర్టీసీ స్థలంలో కబ్జాలు చేయడం లేదని, మహానీయుల విగ్రహాలను ఏర్పాటు చేస్తే ఆర్టీసీ అధికారులకు ఇంత వివక్ష ఎందుకని ప్రశ్నించారు. దీక్షల కోసం తహసీల్దార్, పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చి అనుమతులు ఇవ్వాలని కోరారు. వీరి దీక్షకు దిగి వచ్చి సర్కారు ఆవిష్కరణకు అవకాశం ఇస్తుందా.? దీక్షను అడ్డుకుంటుందా.? అనేది వేచిచూడాలి.