వాన కుండపోత పోస్తున్నది. రెండో రోజూ పలు చోట్ల దంచికొట్టింది. భారీ వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అతలాకుతలమైంది. వరదలు పోటెత్తడంతో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లకు గండ్లు పడడం, వంతెనలు, కల్వర్టులు కొట్టుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదివారం నాటి వర్షానికి ఇండ్లలోకి చేరిన నీళ్లు ఇంకా కొన్ని చోట్ల అలాగే ఉండిపోయింది. అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగి పడడంతో సరఫరాకు ఆటంకం ఏర్పడింది. రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు నిలిపి వేసింది.
– కరీంనగర్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ)
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి జిల్లాలో జనజీవనం అతలాకుతలం అవుతున్నది. ఆదివారం ఒక్కరోజే అతి భారీ వర్షం పడడం, సోమవారం కూడా అక్కడక్కడా కుండపోత పోయడంతో ప్రజానీకం ఇబ్బంది పడాల్సి వచ్చింది. కరీంనగర్ నుంచి రామడుగు మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న వంతెన వరద దాటికి కొట్టుకుపోవడంతో వాహనాలను మోతె గ్రామం మీదుగా రామడుగుకు మళ్లించారు.
కాగా, ఈ వంతెనను సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరిశీలించారు. పక్కన కొత్తగా నిర్మించిన వంతెనను మంగళవారం సాయంత్రంలోగా అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు మోతె వంతెనకు ఇరువైపులా మట్టి కోతకు గురికావడంతో ఏ క్షణంలోనైనా కుంగి పోయే ప్రమాదం ఉన్నదని అధికారులు చెబుతున్నారు. మోతె వాగు కూడా ప్రమాదకరంగా ప్రవహిస్తున్నది. ప్రస్తుతం ఆటోలు, ఇతర వాహనాలేవీ ఈ మార్గంలో నడవడం లేదు. మోతె వంతెన దెబ్బతింటే రామడుగు, పెగడపల్లి మండలాలకు రాకపోకలు నిలిచి పోయే ప్రమాదమున్నది.
ఇక గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ ఆనకట్ట జ్వలించడంతో శివారు గ్రామమైన ఇస్తారిపల్లి ప్రమాదంలో పడింది. రెండేళ్ల కింద నారాయణపూర్ రిజర్వాయర్ కట్ట తెగి పోవడంతో ఈ శివారు గ్రామం ముంపునకు గురైంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా అధికారులు గంగాధర ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం పునరావా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చొప్పదండి మండలం రాగంపేట, ఆర్నకొండ మధ్యన ఉన్న పంది వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రెండు రోజులుగా రాగంపేట, రేవెళ్లె, పెద్దకుర్మపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిపి వేశారు.
మానకొండూర్ మండలంలోని ఈదులగట్టెపల్లి, అన్నారం గ్రామాల్లో కల్వర్టుల మీదుగా వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు నిలిపారు. లింగాపూర్, వెల్ది మధ్యన కల్వర్టు పొంగుతున్న కారణంగా రాకపోకలు నిలిచి లక్ష్మీపూర్, వేగురుపల్లి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గన్నేరువరం వెళ్లే మార్గంలో ప్రధాన రోడ్డు మీదుగా విపరీతమైన వరద పోతుండడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు.
అతి భారీ వర్షాల నేపథ్యంలో 56 బస్సులు నిలిపి వేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కుంట, నర్సరావుపేట వెళ్లే రెండు అంతరాష్ట్ర సర్వీసులు కూడా ఉండగా, ధర్మపురి మార్గంలో 16 బస్సులను నిలిపివేశారు. జగిత్యాల డిపో నుంచి రాయికల్ వెళ్లే 8 బస్సులను రద్దు చేశారు. కరీంనగర్ సర్కిల్ పరిధిలో విద్యుత్ సంస్థకు 18.65 లక్షలు నష్టం జరిగినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
చెట్లు విరిగి పడడంతో 31 స్తంభాలు, 3 ట్రాన్స్ఫార్మర్లు, మరికొన్ని ఇన్సిలెటర్లు దెబ్బతినడంతో గంటల తరబడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని చెప్పారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 13 ఇండ్లు కూలినట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు. కరీంనగర్ జిల్లాలో సోమవారం ఉదయం నాటికి సగటున 51.4 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదవగా, అత్యధికంగా చిగురుమామిడి మండలంలో 83.0 గంగాధర మండలంలో 82.4 మిల్లీ మీటర్లు పడింది.
పెద్దపల్లి జిల్లా కేంద్రంతోపాటు జిల్లా అంతటా ఎడతెరిపి లేకుండా వర్షం దంచికొట్టడంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎలిగేడు మండలంలో అత్యధికంగా 103.5 మిల్లిమీటర్ల వర్షం కురవగా, జిల్లాలో సరాసరిగా 59.1 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో పెద్దపల్లి, మంథని పట్టణాల్లోని ఆర్టీసీ బస్టాండ్లు, ఉదయ్‌నగర్, పోలీస్ స్టేషన్ ఏరియాలతోపాటుగా వివిధ వాడలకు వరద నీరు భారీగా వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లల్లోకి వర్షపు నీరు రావడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు.
గోదావరి, మానేరు నదులకు వరద పోటెత్తడంతో మంథని డివిజన్లోని పరీవాహక ప్రాంతాలైన మంథని, ముత్తారం, రామగిరి మండలాల్లో లోతట్టు గ్రామాల రైతులను అధికారులు అప్రమత్తం చేశారు. మంథని మండలం పోతారం, విలోచవరం, ఉప్పట్ల, ఖాన్సాయిపేట, ఖానాపూర్, గుంజపడుగు, సిరిపురం, అడవిసోమన్‌పల్లి, నాగెపల్లి, స్వర్ణపల్లి, వెంకటాపూర్, మల్లారం, ఆరెంద, చిన్న ఓదాల, గోపాల్పూర్, ముత్తారం మడంలంలోని ఖమ్మంపల్లి, అడవిశ్రీరాంపూర్తో పాటు పలు గ్రామాల్లోని పొలాల్లోని వరద నీరు చేరింది. రామగిరి మండలంలోని సింగరేణి సంస్థ ఆర్జీ-3 డివిజన్ పరిధిలోని ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తికి కొంత విఘాతం కలిగింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అక్కడక్కడా వర్షం పడింది. చెరువులు ప్రమాదకర స్థాయిలో మత్తళ్లు దుంకాయి. గంభీరావుపేట మండలంలోని ఎగువ మానేరు ప్రాజెక్టు ఉధృతంగా మత్తడి దుంకుతున్నది. దీంతో దిగువన మానేరు వాగు రోడ్లపై నుంచి ఉప్పొంగి ప్రవహిస్తున్నది. గంభీరావుపేట-లింగన్నపేట, కోళ్లమద్ది, కొత్తపల్లి, శ్రీగాధ, ముచ్చర్ల ఆయా గ్రామాల మద్య గత రెండు రోజుల నుంచి రాకపోకలు స్తంభించి పోయాయి. ఎగువ మానేరు ప్రాజెక్టుతోపాటు లోలెవల్ వంతెనల వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఎగువ ప్రాంతం నుంచి వస్తు న్న వరద నీటితో పలు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆదర్శనగర్, ప్రకాశం, ఝాన్సీ రోడ్డు, బిలాల్పురా, పద్మపురి వాడ కాలనీల్లో అంతర్గత రహదారులు జలమయమయ్యాయి. పలువురి ఇళ్లలోకి నీళ్లు చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి చుట్టూ చేరిన వరద నీటితో బయటకు రాలేక అవస్థలు పడుతున్నారు.