కోనరావుపేట, ఫిబ్రవరి 10 : “మొక్కలు నాటాలి.. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిది.. ఇంటికి ఐదు మొక్కలు పెంచాలి” అంటూ ప్రతి ప్రభుత్వ సమావేశాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అధికారులే , మొక్కల పాలిట శాపంగా మారారు. రోడ్డు పక్కన ఉన్న చెట్లను మేకలు మేస్తే కాపరికి, ఇంటి ఎదుట పెరిగిన చెట్టు కొమ్మలను నరికి వేస్తే యజమానికి జరిమానా విధించి అధికారులే.. ఏపుగా పెరిగిన పదుల సంఖ్యలో చెట్లను నరికివేసిన ఘటన కోనరావుపేట మండల కేంద్రంలో వెలుగుచూసింది.
స్థానిక ఎంపీడీవో కార్యాలయం వెనుక భాగంలో ఉన్న ఖాళీ స్థలంలో గత ప్రభుత్వ హయాంలో హరితహారం పథకం ద్వారా మొక్కలను నాటే ప్రక్రియ చేపట్టారు. అవి కాస్త ఇప్పుడు ఏపుగా పెరిగి చెట్లుగా మారాయి. అయితే, ప్రస్తుత ప్రభుత్వం మండలానికో మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మించేందుకు అధికారులు ఈ చెట్లు ఉన్న స్థలాన్నే కేటాయించారు. ఎంపీడీవో, తహసీల్ కార్యాలయాల ఎదుట చాలినంత ఖాళీ స్థలం ఉన్నప్పటికీ ఈ స్థలాన్నే కేటాయించడంలో అంతర్యమేమిటో తెలియడం లేదు. అంతే కాకుండా, దుంగలు కూడా కనిపించకుండా పోయాయి.
చెట్లు నరికివేయడమే కాకుండా, దుంగలు మాయమవడం చూస్తే కంచే చేను మేసినట్లుగా మండలాధికారుల పనితీరు ఉందని ప్రజలు మండిపడుతున్నారు. కాగా, ఈ విషయమై ఇన్చార్జి ఎంపీడీవో గూడ శంకర్రెడ్డిని సంప్రదించగా, మండల కేంద్రానికి కేటాయించిన ఇందిరమ్మ మోడల్ ఇంటి నిర్మాణం కోసం ఈ స్థలాన్ని హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు పరిశీలించారని, ఆ తర్వాత చెట్లను నరికివేయడానికి కాంట్రాక్టర్కు అప్పగించడంతో సదరు కాంట్రాక్టర్ వాటిని నరికివేసి దుంగలను తీసుకువెళ్లినట్లు తెలిపారు.