ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త ఎత్తుగడలకు పోతున్నది. ఇందులో భాగంగానే ఉమ్మడి జిల్లాలో నాలుగు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో అర్బన్ అథారిటీలు ఏర్పాటు చేస్తూ ప్రత్యేక జీవోలు విడుదల చేయగా.. త్వరలోనే జగిత్యాల జిల్లాలో కూడా అథారిటీ ఏర్పాటు కానున్నది. ఆయా జిల్లాలను మొత్తంగా అథారిటీల పరిధిలోకి తీసుకవస్తుండగా, అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా ప్రభుత్వం చెప్తున్నది. లోతుగా చూస్తే ఈ విధానం వల్ల పంచాయతీల మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పల్లెల ఆదాయం అథారిటీలకు వెళ్లడం వల్ల.. పంచాయతీలు ఆర్థికంగా చితికిపోయి.. నిర్వీర్యం అవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
కరీంనగర్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి/ కార్పొరేషన్) : ఉమ్మడి జిల్లాలో నాలుగు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటు కాబోతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయం తీసుకోగా.. ఇప్పటికే రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు సంబంధించి ప్రత్యేకంగా జీవోలు జారీ చేసిన విషయం తెలిసిందే. కరీంనగర్ శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) పరిధిని కొత్తగా 147 రెవెన్యూ గ్రామాలకు విస్తరిస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 188 జారీ చేసింది. ఇప్పటి వరకు కరీంనగర్ కార్పొరేషన్‌తోపాటు కొత్తపల్లి మున్సిపాలిటీలు సుడా పరిధిలో ఉండగా.. ఇప్పుడు కొత్తగా హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీలు దీని పరిధిలోకి వస్తాయి. వీటితోపాటు 147 గ్రామాలను సుడా పరిధిలోకి తెస్తూ జీవోను విడుదల చేసింది. అలాగే, వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన వేములవాడ ఆలయ ఏరియా అభివృద్ధి ప్రాధికార సంస్థ (వీటీడీఏ)పరిధిని రాజన్న సిరిసిల్ల మొత్తానికి వర్తింపజేస్తూ.. జీవో నంబర్ 184ను విడుదల చేసిన విషయం తెలిసిందే. వేములవాడ అర్బన్ మండలంలోని 11 గ్రామాలతోపాటు.. వేములవాడ పురపాలక సంఘం మాత్రమే గతంలో దీని పరిధిలో ఉండేది. కొత్తగా సిరిసిల్ల మున్సిపాలిటీతోపాటు వేములవాడరూరల్, బోయినపల్లి, ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్, గంభీరావుపేట, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట మండలాల్లోని 152 రెవెన్యూ గ్రామాలను దీని పరిధిలోకి తీసుకొచ్చారు. అలాగే, పెద్దపల్లి జిల్లాలో రామగుండం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(రుడా)ని ఏర్పాటు చేస్తూ జీవో నెంబర్ 165ను జారీ చేసింది. జిల్లాలోని రామగుండం నియోజకవర్గాన్ని పూర్తిగా పెద్దపల్లి, మంథని, ధర్మపురి నియోజకవర్గాల్లోని కొంత భాగాన్ని దీని పరిధిలోకి చేర్చింది. రామగుండం కార్పొరేషన్, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలతో పాటు ధర్మారం, పాలకుర్తి, అంతర్గాం, పెద్దపల్లి, జూలపల్లి, ఎలిగేడు, సుల్తానాబాద్, ఓదెల, కాల్వశ్రీరాంపూర్, మంథని, రామగిరి, కమాన్‌పూర్, ముత్తారం మండలాల్లోని 198 గ్రామాలను రుడా పరిధిలోకి తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే.. జగిత్యాల జిల్లాకు సంబంధించిన ప్రతిపాదనలు సైతం ఇప్పటికే ప్రభుత్వం ముందున్నాయి. జిల్లా బేస్డ్గా, ఒక అథారిటీగా ఏర్పాటు చేస్తూ త్వరలోనే ఉత్తర్వులు జారీ కానున్నాయి. వీటికి సంబంధించిన అన్ని పనులూ ప్రభుత్వం వద్ద పూర్తయ్యాయని తెలుస్తుండగా.. అతి త్వరలోనే ఈ ఉత్తర్వులు వెలువడుతాయని ఓ ఉన్నతాధికారి ‘నమస్తే’కు తెలిపారు. అంటే.. ఆ జిల్లా ఆధారంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేస్తున్నట్లుగా స్పష్టమవుతోంది.
ఇప్పటికే ఆర్థిక లేమితో కొట్టుమిట్టాడుతున్న పంచాయతీలకు అథారిటీలు కొత్త కష్టాలను తెచ్చిపెడుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. గ్రామ పంచాయతీల్లో భవన నిర్మాణ అనుమతుల నుంచి వచ్చే బెటర్మెంట్, డెవలప్మెంట్ ఫీజులు ఇప్పటి వరకు పంచాయతీల ఖాతాల్లోనే జమవుతున్నాయి. కాగా, అర్బన్ అథారిటీ పరిధిలోకి వచ్చిన తర్వాత మాత్రం డెవలప్మెంట్ ఫీజులన్నీ అథారిటీ అకౌంట్‌కు చేరుతాయి. దీని వల్ల పంచాయతీలకు ఆదాయం పూర్తిగా తగ్గిపోతుంది. అప్పుడు పంచాయతీలు కేవలం ఆస్తి పన్నులు, చెత్త సేకరణ యూజర్ చార్జీల మీదే ఆధార పడాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతోపాటు అథారిటీలు రూపొందించే మాస్టర్ ప్లాన్ విషయంలోనూ ఎక్కువగా మండలాలను పరిగణలోకి తీసుకుంటారు. దీంతో రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్, మిక్స్డ్ జోన్లుగా ప్రాంతాలు విభజన చేయాల్సి ఉంటుంది. ఫలితంగా ఎవరి ఇష్టానుసారం వాళ్లు నిర్మాణాలు చేసుకోవడానికి ఆస్కారం ఉండదు. పంచాయతీలు అనుమతులు ఇవ్వడానికి అథారిటీ చట్టాలు ఒప్పుకోవు. దీని వల్ల సమస్యలు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. అలాగే, పంచాయతీల్లో వివిధ నిర్మాణ అనుమతుల ద్వారా వచ్చే ఆదాయాలను అథారిటీలు అదే పంచాయతీల్లో వెచ్చించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ రంగంలోని నిపుణులు చెపుతున్న దాని ప్రకారం చూస్తే.. అర్బన్ అథారిటీ అమల్లోకి వచ్చిన తర్వాత ఏ పంచాయతీలైనా సరే.. 300 చదరపు మీటర్లకు మించి విస్తీర్ణంలో నిర్మాణం చేయాలంటే ఆయా అర్బన్ అథారిటీల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే, జీ ప్లస్ 3 దాటే నిర్మాణాల అనుమతుల కోసం అర్బన్ అథారిటీకి వెళ్లాల్సిందే. అలాగే, అర్బన్ అథారిటీ పరిధిలోకి వచ్చే ఏ పంచాయతీలో అయినా వాణిజ్య నిర్మాణాలు చేపడితే తప్పనిసరిగా అథారిటీకి వెళ్లాల్సిందే. అది ఏ చిన్న వాణిజ్య నిర్మాణమైనా.. ఉదాహరణకు చూస్తే.. కోళ్ల షెడ్స్ వంటి ఇతర ఎలాంటివైనా అథారిటీ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఆయా అథారిటీల్లో నిర్ణయించిన మేరకు ఫీజులు కూడా భారీగానే ఉండే అవకాశం ఉంది. అలాగే, ఇంటి పన్నులు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అన్ని జిల్లాల్లోని పంచాయతీల్లో మాస్టర్ ప్లాన్ అమలు చేయడం కోసం జిల్లా టౌన్ కంట్రీ, ప్లానింగ్ ఆఫీసర్ (డీటీసీపీ) ఉన్నారు. ప్రస్తుతం జిల్లా మొత్తాన్ని అర్బన్ అథారిటీ పరిధిలోకి తీసుకుంటున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ విభాగం పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పేరుతో తీసుకుంటున్న ఈ నిర్ణయం వెనుక ప్రభుత్వం ఆదాయం పెంచుకోవాలన్న ఎత్తుగడ కనిపిస్తున్నా.. పంచాయతీల మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ రంగంలోని వివిధ నిపుణుల ద్వారా సేకరించిన సమాచారం చూస్తే.. అథారిటీలు అమల్లోకి వస్తే పంచాయతీలు ఆర్థికంగా పూర్తిగా చితికిపోయే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం పంచాయతీలకు వివిధ రూపేణా వస్తున్న పన్నులు, ఇతర ఆదాయాల్లో ఇక నుంచి మెజార్టీ శాతం అర్బన్ అథారిటీలకు సమకూరనున్నాయి. అంతేకాదు.. పల్లె ప్రజలు పంచాయతీలను విడిచి తమ పనులకోసం అథారిటీల వెంట తిరగాల్సి వస్తుందని తెలుస్తోంది. అథారిటీల ఏర్పాటు, దాని వెనుక దాగి ఉన్న అంశాలను లోతుగా విశ్లేషించి చూస్తే. పంచాయతీల మనుగడకు ఇబ్బంది తప్పదని తెలుస్తోంది. అర్బన్ అథారిటీల విస్తరణతో గ్రామ పంచాయతీల ఆదాయాలకు కోతలు పడనున్నాయి. వీటితోపాటు ఒక స్థాయి దాటిన భవన నిర్మాణ అనుమతుల కోసం, వాణిజ్య అవసర నిర్మాణ అనుమతుల కోసం ఇక ముందు అర్బన్ అథారిటీల వద్దకు వెళ్లాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. దీని వల్ల ఆయా గ్రామ పంచాయతీల పరిధిల్లో ఉన్న ప్రజలకు ఇబ్బందులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. ప్రస్తుతం పంచాయతీ పరిధిలో గృహ నిర్మాణాలు, వాణిజ్య నిర్మాణాలు ఏవి చేసినా పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకొని అక్కడి నుంచే అనుమతులు తీసుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో స్థానికంగా ఉండే అవసరాలకు అనుగుణంగా, పంచాయతీ రూపొందించిన ప్లాన్ ప్రకారం రోడ్ల విస్తీర్ణం వాటిని పరిగణనలోకి తీసుకొని నిర్మాణ అనుమతులు ఇస్తున్నారు. కాగా, అర్బన్ అథారిటీ పరిధిలోకి వస్తే.. 30 ఫీట్లకు తక్కువగా రోడ్డు ఉండే అనుమతులు దొరకడం కష్టమే. అలాగే, అర్బన్ అథారిటీ మాస్టర్ ప్లాన్ ప్రకారమే నిర్మాణాలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది పూర్తిగా స్థానికంగా ఉండే ప్రజలకు ఇబ్బందులు తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.