కరీంనగర్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కలెక్టరేట్ : అల్పసంఖ్యాక వర్గాల్లో విద్యాభివృద్ధిని పెంపొందించి, వారి కుటుంబాల్లో వెలుగురేఖలు నింపే లక్ష్యంతో గత కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీ విద్యార్థులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గురుకుల విద్యాసంస్థలు ప్రారంభించింది. ఆ మేరకు గురుకులాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి, సరైన ప్రణాళికతో ముందుకు నడిపించింది. దీంతో, మైనార్టీల్లో అంతంత మాత్రంగానే ఉన్న విద్యాశాతం ఏటేటా పెరుగుతూ వచ్చింది. మైనార్టీతోపాటు మైనార్టీయేతర కుటుంబాలు నిర్ధారిత కోటా ప్రకారం తమ పిల్లలను మైనార్టీ గురుకులాల్లో చదివేంచేందుకు ఆసక్తి చూపడం కనిపించింది. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహణ గాడితప్పుతున్నట్టు తెలుస్తున్నది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ‘మైనార్టీ గురుకుల విద్యాసంస్థల గతమెంతో ఘనం.. ప్రస్తుతం అవినీతి మయం’ అన్నట్టు మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులకు అందించాల్సిన పౌష్టికాహారం, భోజన సరుకులు పక్కదారి పడుతుండగా, గురుకుల సీట్లు అంగట్లో అన్నట్టు మారడంతోపాటు బోధన నామమాత్రమైందనే విమర్శలు వస్తున్నాయి.
విద్యాసంస్థలను నిరంతరం పర్యవేక్షించాల్సిన అధికారులు తమకున్న రాజకీయ పలుకుబడితో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండగా, మైనార్టీ విద్యాసంస్థలు భ్రష్టుపడుతున్నాయనే చర్చ నడుస్తున్నది. అందులో అవినీతి అక్రమాలపై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వెళ్తున్నా, క్షేత్రస్థాయిలో కనీస విచారణ చేయకుండా.. పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తున్నది. దీంతో పలు విద్యా సంస్థల్లో పర్యవేక్షకులు తాము ‘ఆడిందే ఆట.. పాడిందే పాట’ అన్నట్టుగా విధులు నిర్వర్తిస్తున్నారని కొంతమంది గురుకుల సిబ్బంది మండిపడుతున్నారు. అధికారులు తనిఖీలకు వెళ్లి, వాస్తవాలు సేకరించి, ఉన్నతాధికారులకు నివేదికలు పంపినా చర్యలు లేకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహిస్తున్నారు. మరోవైపు తనిఖీలకు వెళ్లే అధికారులపై కూడా అజమాయిషీ చేస్తూ, బెదిరింపులకు పాల్పడుతూ గురుకుల వ్యవస్థకు కొత్త భాష్యం చెబుతున్నారనే చర్చ నడుస్తున్నది. నిబద్ధతతో విధులు నిర్వర్తించే వారిని నయానో..
భయానో తమవైపునకు తిప్పుకోవడం, వినకపోతే సదరు అధికారిపైనే లేనిపోని ఆరోపణలు చేయడం, తమను ఇబ్బంది పెడుతున్నారంటూ పై అధికారులు, ప్రజాప్రతినిధులకు చెప్పి పక్కదారి పట్టిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. పైగా విద్యార్థులకు పౌష్టికాహారంలో భాగంగా అందించాల్సిన పాలను బహిరంగ మార్కెట్లో సిబ్బందితో విక్రయించడం, ముక్కిన బియ్యం వేలం పేర నేరుగా అమ్మకాలు జరపడం, తమ ఇళ్లలో జరిగే విందూ వినోదాలకు కూడా గురుకులాల్లోని ఆహార సామగ్రినే వినియోగిస్తుండడం, విద్యాసంస్థల్లో మరమ్మతుల పేరిట వేలాది రూపాయల బిల్లులు పెట్టడం.. లాంటి తప్పుడు పనులు చేస్తున్నారనే ఆరోపణలు సర్వసాధారణంగా మారాయి. నిబంధనల ప్రకారం ముక్కిన బియ్యం విక్రయించాలంటే.. ముందుగా పై అధికారులకు సమాచారమిస్తే, వారు కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా తెలుపుతారు. అనంతరం కలెక్టర్ ఆయా మండల పరిధిలోని తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేస్తే, పౌరసరఫరాల సిబ్బంది వెళ్లి బియ్యం నాణ్యతను పరిశీలిస్తారు. ఆ తర్వాత వేలం వేస్తారు. కానీ, ఎలాంటి అనుమతులు లేకుండా, ఉన్నతాధికారులకు కనీస సమాచారం లేకుండా విక్రయించడం, వచ్చే సొమ్మును కూడా లెక్కల్లో చూపకపోవడం షరామామూలుగా మారినట్టు తెలుస్తున్నది.
కంచే చేను మేసిన చందంగా కొన్ని గురుకులాల్లో సీట్లు అమ్ముకుంటున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఇక్కడ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇటీవల ఓ గురుకులంలో 40వేలకు మైనార్టీయేతర కోటాలో సీటును విక్రయించడం, అందుకోసం ఓ సెక్యూరిటీ గార్డు పైరవీకారుడిగా వ్యవహరించడం, అందుకు సంబంధించిన వాయిస్ రికార్డు బయటకు రావడం కలకలం రేపింది. నిజానికి సదరు విద్యార్థిని ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోలేదని తెలిసింది. అలాగే మరో గురుకులంలో మైనార్టీ కోటాలోని సీటును చివరకు 25వేలకు విక్రయించినట్టు సమాచారం. దీంతోపాటు కరీంనగర్ జిల్లాకేంద్రాన్ని ఆనుకొని ఉన్న ఓ నియోజకవర్గంలోని మైనార్టీ గురుకులంలో నిబంధనలకు మించి మైనార్టీయేతరులున్నట్టు తెలిసింది. అంటే మైనార్టీ కోటాలోని సీట్లను ఇతరులకు సదరు వ్యక్తి అమ్ముకున్నట్టు సమాచారం. ఇదే తరహా దందా మరికొన్ని గురుకులాల్లోనూ జరిగినట్టు తెలుస్తున్నది. అయితే ఈ సీట్లు అమ్ముకున్న వవ్యహారం బయటకు రావాలంటే ఆన్లైన్ దరఖాస్తులు, అలాగే ప్రస్తుతం ఆయా గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల పేర్ల జాబితాను పోల్చి చూడాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో 23 మైనార్టీ గురుకులాలు ఉండగా, అందులోని ఆరు గురుకులాల్లో వివిధ విషయాల్లో 10 లక్షల ఫ్రాడింగ్ జరిగిందని స్వయంగా సంబంధిత ఆడిట్ అధికారులే తేల్చిచెప్పారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు పంపారు. కానీ, అక్రమాలకు పాల్పడిన వారిపై నేటి వరకు చర్యలు తీసుకోలేదు. వీటిపై ఇటీవల ఓ అధికారి పూర్తి ఆధారాలతో ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే సదరు అధికారిపై సైతం లేనిపోని ఆరోపణలు చేసి, తమను వేధిస్తున్నారంటూ ఉన్నతాధికారులకు, రాజకీయ నాయకులకు చెప్పి విషయాన్ని అక్రమార్కులు మొత్తం పక్కదారి పట్టించినట్టు తెలుస్తున్నది. దీంతో సదరు అధికారిని ప్రస్తుతం ఆ విధుల నుంచి తప్పించడంతో ఇక తమదే పై చేయి అయిందంటూ కొంత మంది అక్రమార్కులు ఒక చోట ఉత్సవాలే చేసుకున్నట్టు తెలిసింది. కొన్నింటిలో జరుగుతున్న అక్రమాలపై విద్యార్థుల తల్లిదండ్రులు సంబంధిత విద్యాసంస్థల పర్యవేక్షకులను ప్రశ్నిస్తే.. వారిని సైతం బెదిరింపులకు గురిచేయడం, మీ పిల్లలు సరిగా చదవడం లేదంటూ టీసీలు ఇచ్చి బయటకు పంపుతున్నారనే ఆవేదన వారి నుంచి వ్యక్తమవుతున్నది. అక్రమార్కులకు కొంత మంది అధికార పార్టీ నాయకులు వంత పాడుతున్నట్టు సమాచారం. అంతేకాదు, అక్రమార్కులపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా సదరు నాయకులు ఉన్నతాధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వాస్తవాలను గుర్తించి, చర్యలు తీసుకొని తల్లిదండ్రులకు భరోసా ఇవ్వడంతోపాటు అక్రమాలకు అడ్డకట్ట వేయాలన్న డిమాండ్ వ్యక్తమవుతున్నది.