Sircilla | బతుకమ్మ చీరెలిచ్చి నేతన్నల బతుకులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా కల్పించారు. చేసిన కష్టానికి ఫలితం ఉండాలన్న ఉద్దేశంతో త్రిఫ్ట్ పథకం(పొదుపు) అమలు చేశారు. పోగు చేసిన దానికి కొంత కలిపి చేయూతనిచ్చారు. మూడేళ్లకు రెట్టింపు అయిన డబ్బులు కండ్లారా చూసుకుని మురిసి పోయిన నేతన్నలపై కాంగ్రెస్ సర్కారు కక్షగట్టింది. పొదుపు చేసిన నగదు ఇవ్వకుండా రేవంత్ సర్కారు దాటవేస్తుండడంతో కార్మిక వర్గం కన్నెర్ర చేస్తున్నది.
రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : చేనేత కార్మికుల కోసం గతంలో కేంద్ర ప్రభుత్వం త్రిప్ట్ పథకం (పొదుపు) ప్రవేశపెట్టింది. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే ఈ పథకాన్ని రద్దు చేసింది. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ చేనేత, మరమగ్గాల కార్మికుల కోసం త్రిప్ట్ పథకాన్ని 2017లో తిరిగి పునరుద్ధరించారు.
చేనేత, మరనేతన్నల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వారు 8 శాతం జమజేస్తే, మరో 8 శాతం బీఆర్ఎ స్ ప్రభుత్వం కలిపి బ్యాంకులో జమజేసింది. ఈ పథకం కాలపరిమితి మూడేళ్లు కాగా, గడువు దాటిన తర్వాత నేతన్నలకు పొదుపు చేసుకున్న దానికి రెండింతల నగదు వస్తుంది. ఈ సౌలభ్యంతో ఒక్కో కార్మికుడు 40 వేల నుంచి 60వేల వరకు జమ చేసుకునే అవకాశం కల్పించింది. చాలా మంది కార్మికులు వచ్చిన డబ్బులు వారి పిల్లల పెళ్లిళ్లు, ఇల్లు కట్టుకునేందుకు, ఇలా తమ అవసరాలకు వినియోగించుకున్నారు.
కేసీఆర్ తెచ్చిన ఈ పథకం చాలా బాగుందంటూ కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్లు కాలపరిమితి ఉన్న ఈ పథకాన్ని రెండేళ్లకు కుదించింది. ఇది హర్షనీయమే అయినా కార్మికులు జమ చేసిన నగదుకు 8 శాతం ప్రభుత్వం ఇంకా బ్యాంకుల్లో జమచేయక పోవడం సమస్యగా మారింది. దీని గడువు కూడా మూడు నెలల క్రితమే ముగిసింది.
కార్మికుల ఎదురుచూపు
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న చేనేత, మరనేతన్నలు మొత్తం 4963 మంది ఉన్నారు. వీరంతా జౌళీశాఖ నుంచి గుర్తింపు పొందగా, త్రిఫ్ట్ పథకంలో చేర్చారు. వీరి సంపాదించిన కూలీ డబ్బుల్లో 8 శాతం వివిధ బ్యాంకుల్లో అధికారులు పొదుపు చేయించారు. రెండేళ్లలో చేసిన పొదుపునకు సుమారు 20 వేలు కడితే మరో 20 వేలు సర్కారు బ్యాంకులో జమ చేస్తుంది. ఈ విధంగా త్రిప్ట్ పథకం రెండేళ్ల కింద ప్రారంభమై, గత మే నెలలో ముగిసింది.
ముగిసిన వెంటనే డబ్బులు చేతికి రావాల్సి ఉండగా, మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటీ వరకు అందలేదు. కారణమేంటని అడిగితే.. సర్కారు పైసలు ఇంకా జమ చేయలేదని అధికారులు చెబుతున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని నేతన్నలు పొదుపు పైసల కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. 4963 మందికి 12 కోట్లు రావాల్సి ఉందని తెలిపారు. దీంతో నేతన్నలు తాము పొదుపు చేసుకున్న పైసలు కూడా ఇవ్వక పోవడం ఏంటంటూ సర్కారును నిలదీస్తున్నారు. అసలు పైసలు వస్తాయా? రావా? అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
న్యాయం జరిగేలా చూడాలి
నేతన్నల పొదుపు పైసలు కూడా సర్కారు ఇవ్వక పోవడం దారుణం. వచ్చేవన్నీ పెద్ద పండుగలే. పైసా పైసా కూడగట్టుకుని ఎన్నో ఆశలు పెట్టుకున్న కార్మికులకు నిధులు మంజూరు చేయకుండా ప్రభుత్వం జాప్యం చేస్తున్నది. గత ప్రభుత్వం ఎన్నడు కూడా త్రిప్ట్ పథకం పైసలు ఆపలేదు. వెంటనే ప్రభుత్వం స్పందించి కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలి.
– మూషం రమేశ్, తెలంగాణ పవర్లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు