Mancharami | సుల్తానాబాద్ రూరల్ జనవరి 1: గత కొంతకాలం నుంచి సాగునీరు అందని బీడి భూములకు సాగునీరు అందించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని మంచరామి గ్రామంలోని తుమ్మలమెట్ల కాల్వ చెడిపోయి ఉండడంతో సాగునీరు అందక నాలుగేళ్ల నుంచి బీడు భూములుగా మిగిలిపోయాయి. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ ఉప్పు లక్ష్మీ-తిరుపతి దంపతులు ఎన్నికల ప్రచారంలో ఎస్సీ కాలనీలో పర్యటించినప్పుడు రైతులు చెడిపోయిన కాలువ మరమతులు చేసి సాగునీరం అందించాలని కోరారు.
గెలిచిన సర్పంచ్ ఉప్పు లక్ష్మి-తిరుపతి సొంత ఖర్చులతో రూ.లక్షతో కాల్వకు సీసీ, అక్కడక్కడ సైడ్ వాల్స్ నిర్మాణం చేయించారు. సర్పంచ్ పాలకవర్గంతో కలిసి గురువారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించి, బీడు భూములకు సాగునీరు అందించారు. బీడు భూములకు సాగునీరు అందడంతో రైతులు యాసంగి పంటకు సిద్ధమవుతున్నారు. రైతులతో పాటు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా సర్పంచ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఉప్పు తిరుపతి, ఉపసర్పంచ్ శ్రీనివాస్, గ్రామపంచాయతీ కార్యదర్శి రాజేష్, వార్డు సభ్యులు అనిత, రమాదేవి, లక్ష్మణ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.