Godavarikhani | కోల్ సిటీ, జూలై 2: రామగుండం నగర పాలక సంస్థ లో 2024లో జరిగిన డీజిల్ అవకతవకలపై విచారణ పూర్తైంది. పారిశుధ్య విభాగానికి కీలకంగా వ్యవహరించిన ఓ అధికారి పలు అవకతవకలకు పాల్పడినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. ‘బల్దియాలో డీజిల్ గోల్ మాల్..’ అనే శీర్షికన అప్పట్లో ‘నమస్తే తెలంగాణ’లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఈ అవకతవకలపై 25వ డివిజన్ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు హైదరాబాద్ లోని విజిలెన్స్ ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశారు.
దాంతో పురపాలక సంఘం వరంగల్ రీజనల్ డైరెక్టర్ సాహిద్ మసూద్ ను అవకతవకలపై విచారణకు బాధ్యతలు అప్పగించారు. నాలుగు నెలల క్రితం రీజనల్ డైరెక్టర్ సాహిద్ మసూద్ రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంకు చేరుకొని పారిశుధ్య విభాగంకు సంబంధించిన అన్ని రికార్డులను పరిశీలించారు. రోజంతా కార్యాలయంలోనే విచారణ కొనసాగింది. పారిశుధ్య, ఇంజనీరింగ్ విభాగాల అధికారులను వేర్వేరుగా పిలిచి వివరాలు సేకరించారు. ఆ సమయంలో కొన్ని రికార్డులు సమర్పించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం విజిలెన్స్ అధికారుల నుంచి కూడా పలు రికార్డులను ఆయన తెప్పించుకున్నారు. డీజిల్ అవకతవకలపై అడ్మినిస్ట్రేషన్ పరంగా అవకతవకలు జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. సమగ్ర విచారణ అనంతరం వారం రోజుల క్రితం ఆ నివేదికలను హైదరాబాద్లోని డీఎంఏకు పంపించారు. ఈ విషయమై రీజనల్ డైరెక్టర్ సాహిద్ మసూద్ ను వివరణ కోరగా, డీజిల్ లెక్కలపై జరిపిన విచారణలో అవకతవకలు జరిగాయనీ, పూర్తి నివేదికలను డీఎంఏకు సమర్పించినట్లు స్పష్టం చేశారు.
ఈ విషయమై హైదరాబాద్ లోని డీఎంఏను సంప్రదించగా రెండు రోజుల క్రితమే నివేదికలు వచ్చాయనీ, వాటిని పరిశీలించాక తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. డీజిల్ అవకతవకల వ్యవహారంపై విచారణ పూర్తి కావడంతో నగర పాలక కార్యాలయంలో చర్చనీయాంశంగా మారింది. బాధ్యులపై వేటు పడుతుందా.? లేదా అన్నది అధికార వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.