బ్యాంకాక్: ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నీలో భారత ‘ఏ’ జట్టు టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచింది. బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన తొలి సెమీస్‌లో రాధా యాదవ్ సారథ్యంలో భారత ‘ఏ’ జట్టు.. శ్రీలంక ‘ఏ’పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన లంక.. భారత బౌలర్లకు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో 19.4 ఓవర్లకు 118 పరుగులకే ఆలౌట్ అయింది. రాధా (4/19) నాలుగు వికెట్లతో విజృంభించగా తనూజా, ప్రేమ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. లంక బ్యాటర్లలో సంజనా (31) ఆదుకోకుంటే ఆ జట్టు పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. స్వల్ప ఛేదనను భారత్ 13.3 ఓవర్లలోనే పూర్తిచేసింది. ఓపెనర్ దినేశ్ వృందా (42)కు తోడు సారథి రాధా (31*) అజేయంగా ఉండి జట్టును విజయపథాన నడిపించింది. రెండో సెమీస్‌లో బంగ్లాదేశ్ ‘ఏ’.. పాకిస్థాన్ ‘ఏ’పై 54 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్ చేరింది. భారత్, బంగ్లాదేశ్ నడుమ ఈనెల 22న ఇదే వేదికపై ఫైనల్ జరుగనుంది.