తెలంగాణ చౌక్, మార్చి 7: అతివలకు ఆర్టీసీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ కానుకిచ్చింది. ఈ నెల 8న ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఆర్టీసీ కరీంనగర్ రీజనల్ మేనేజర్ అంచూరి శ్రీధర్ సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అరవై ఏండ్లు పైబడ్డ మహిళలు ఈ నెల 8న మంగళవారం తమ ఆధార్ కార్డులు చూపించి ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత ప్రయాణం చేయవచ్చని చెప్పారు. మహిళా పారిశ్రామిక వేత్తలు, ఎస్‌హెచ్‌జీ, డ్వాక్రా సంఘాల సభ్యులకు ఈ నెల 31 వరకు బస్టాండ్లలో తమ ఉత్పత్తులు విక్రయించుకునే అవకాశమిస్తున్నట్లు తెలిపారు. లైట్ మోటార్ వెహికిల్ లైసెన్స్ కలిగి ఉన్న మహిళలకు హెవీ మోటార్ డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు, అలాగే, పల్లెవెలుగు బస్సుల్లో సీటు నం.4, 5, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో సీటు నం.1,2లలో కేవలం గర్భిణులు, పాలిచ్చే తల్లులు కూర్చుని ప్రయాణ అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. స్త్రీలకు కేటాయించిన సీట్లలో వారిని మాత్రమే కూర్చునేలా కండక్టర్లు చర్యలు చేపట్టాలన్నారు. ప్రయాణికులు లేని సందర్భాల్లో మాత్రమే పురుషులు కూర్చునే అవకాశమివ్వాలని సూచించారు. బస్టాండ్లు, ట్రాఫిక్ కూడళ్లలో ఏర్పాటు చేసిన పర్పుల్ కలర్ డ్రాప్ బాక్సుల్లో మంగళవారం రోజున మహిళా ప్రయాణికులు తమ టికెట్లపై పేరు, సెల్ ఫోన్ నంబర్ రాసి వేసినట్లయితే, ఏప్రిల్ 2న తీసే లక్కీ డ్రా తీసి బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. అలాగే, నెలరోజుల పాటు 30 కి.మీల దూరం ఉచితంగా ప్రయాణించే అవకాశం కూడా కల్పించనున్నట్లు చెప్పారు. మహిళా సాధికారతకు చిహ్నంగా ప్రతి ఆర్టీసీ ఉద్యోగి పర్పుల్ కలర్ రిబ్బన్ విధిగా ధరించాలని, మహిళా ప్రయాణికుల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారానికి 9440970000 అనే వాట్సాప్ నంబర్ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. మహిళలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.