కరీంనగర్ కలెక్టరేట్, సెప్టెంబర్ 20 : “మహిళలే దేశ ప్రగతిలో కీలకం కాబోతున్నారు. వారికి ఆర్థిక స్వావలంబన కల్పిస్తే దేశం మరింత ముందుకు సాగుతుంది.” అని రెండేళ్ల క్రితం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ప్రధాని నరేంద్ర మోదీ మహిళాలోకాన్ని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు మాటలకే పరిమితమయ్యాయి. స్వశక్తి సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే క్రమంలో వారితో మండల కేంద్రాల్లో రూరల్ మార్ట్లు ఏర్పాటు చేయిస్తామంటూ ఆ సభలో అట్టహాసంగా ప్రకటించారు. అయితే, ఆచరణలో మాత్రం నామ్కే వాస్తే అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో జిల్లా మహిళల్లో కేంద్రం తీరుపై అసంతృప్తి పెల్లుబికుతోంది. రూరల్ మార్ట్ల పేర మండల కేంద్రాల్లో సూపర్ మార్కెట్లు ఏర్పాటు చేసేందుకు జిల్లా నుంచి పంపిన ప్రతిపాదనల్లో ఒక్క శాతమే అంగీకరించి రుణం మంజూరు చేయగా, మిగతా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఎన్నికలకు ముందు ఓ మాట, తర్వాత మరో మాట అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ, తమకు అనుకూలంగా ఉన్న ఉత్తర ప్రాంతానికే పెద్దపీట వేస్తుండడంపై మహిళల నుంచి అసహనం వ్యక్తమవుతోంది. కేంద్రం అనుసరిస్తున్న వైఖరి తెలంగాణ మహిళలపై చిన్న చూపు చూస్తుందనే అంశం స్పష్టమవుతోందంటూ స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు వెల్లడిస్తున్నారు. పేదరికంతో కొట్టుమిట్టాడుతూ దినసరి కూలీ చేసుకునే స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తూ, వారిని చిరు వ్యాపారులుగా అభివృద్ధి చేస్తామంటూ కేంద్రం గతంలోనే ప్రకటించింది. ఇందుకనుగుణంగా ఔత్సాహిక మహిళా సంఘాలను ఎంపిక చేసి, జాబితా అందజేయాలంటూ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)కు ఆదేశాలు జారీ చేసింది.
నాబార్డ్ ద్వారా రూ.1.50 లక్షల రుణ సాయమందిస్తామంటూ ప్రకటించింది. దీంతో, జిల్లాల అధికారులకు ఎంపిక బాధ్యతలు అప్పగించగా, జిల్లాలో ప్రయోగాత్మకంగా నాలుగు మండలాల్లో నాలుగు సంఘాలను ఎంపిక చేసి, ప్రతిపాదనలు పంపారు. కరీంనగర్, మానకొండూర్, చొప్పదండి, గన్నేరువరం మండలాల్లో మండల సమాఖ్యల ద్వారా రూరల్ మార్ట్లు నిర్వహించనున్నట్లు ప్రతిపాదనల్లో పేర్కొనగా, కేవలం ఒక్క కరీంనగర్ మండలానికి మాత్రమే నాబార్డ్ ముందుగా అవకాశం కల్పించింది.
మిగతా మూడు మండలాల్లో కూడా ఏర్పాటు ఈ మార్టులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామంటూ పేర్కొన్నా, ఇప్పటివరకు మహిళా సమాఖ్యల ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ర్టాలకు నిధులు పారదర్శకంగా విడుదల చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం కేవలం కొన్ని రాష్ర్టాలకే పరిమితం చేస్తూ, మిగతా రాష్ర్టాలకు అంతంతమాత్రంగానే విడుదల చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహిళాభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా, చేతల్లో పాటించేలా ఉండాలని గ్రామస్తులు కోరుతున్నారు.