Student Abscond | ధర్మారం, జూలై 19: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం లోని తెలంగాణ రాష్ట్ర బాలుర గురుకుల కళాశాల (టీజీఆర్జేసీ) ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి ఇమ్మడి మెగా వర్షిత్ శనివారం తెల్లవారుజామున విద్యాలయం నుంచి పరారయ్యాడు.
ఆ విద్యార్థి ఇంటికి చేరకపోవడంతో అతడి తండ్రి విధిలేని పరిస్థితుల్లో అతని ఆచూకీ కోసం ఆందోళనతో విద్యాలయానికి వచ్చాడు. విద్యార్థి ఆచూకీ దొరకపోవడంతో కళాశాల ప్రిన్సిపల్ ధర్మారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విద్యార్థి తండ్రి, కళాశాల ప్రిన్సిపల్ విద్యాసాగర్ కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రానికి చెందిన ఇమ్మడి సత్తయ్య కు ఇద్దరు కుమారులు ఉండగా వారిలో పెద్ద కుమారుడు మెగా వర్షిత్ నంది మేడారంలోని టీజీ గురుకుల కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ బైపీసీలో జూన్ 16న జాయిన్ అయ్యాడు.
కళాశాలలో చేరినప్పటి నుంచి విద్యార్థి చదువుకుంటూ గురుకులంలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల విద్యార్థి మెగా వర్షిత్ కు జ్వరం రావడంతో తండ్రి వైద్యం చేయించి తిరిగి కళాశాలకు పంపించాడు. అనంతరం విద్యార్థి ఆ విద్యాలయంలో తోటి విద్యార్థులతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున 4:30 గంటలకు ఆ విద్యాలయం పీడీ సురేష్ విద్యార్థుల అందరినీ అసెంబ్లీ చేయించి హాజరు తీసుకున్నాడు. ఈ క్రమంలో విద్యార్థి మెగా వర్షిత్ గైర్హాజర్ అయినట్లు పీడీ గుర్తించాడు.
ఈ విషయాన్ని పీడీ ప్రిన్సిపల్ విద్యాసాగర్ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో కళాశాలలో ఉన్న సీసీ కెమెరాలను పరీక్షించడంతో తెల్లవారుజామున 4:23 నిమిషాలకు విద్యార్థి కళాశాల నుంచి బ్యాగుతో బయలుదేరి విద్యాలయ గేటు దూకి పరారై వెళ్లినట్లుగా సీసీ కెమెరా ద్వారా ఉపాధ్యాయులు గుర్తించారు. దీంతో ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ సదరు విద్యార్థి తండ్రి కి సమాచారమందించాడు. విద్యార్థి పరారైన సంఘటన గురించి ప్రిన్సిపాల్ విద్యాసాగర్ ధర్మారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాగా మొదట తన కుమారుడు బంధువుల ఇంటికి వెళ్లి ఉండవచ్చని అని మెగా వర్షిత్ తండ్రి భావించాడు.
కానీ తన కుమారుడు గురించి తెలిసిన బంధువులందరికీ ఫోన్ చేసి తెలుసుకున్నాడు. కానీ అతని కుమారుడు మెగా వర్షిత్ బంధువుల వద్దకు వెళ్లలేదని నిర్ధారణ చేసుకున్న తండ్రి సత్తయ్య ఆందోళనతో మధ్యాహ్న సమయంలో నంది మేడారంలోని బాలుర గురుకుల కళాశాలకు చేరుకున్నాడు. తన కుమారుడి ఆచూకీ తెలియ రాలేదని ప్రిన్సిపల్ విద్యాసాగర్ కు వివరించి తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. దీనిపై ప్రిన్సిపల్ విద్యాసాగర్ ను వివరణ కోరగా విద్యార్థి మెగా వర్షిత్ ఆచూకీ తెలియలేదని అతని తండ్రి సత్తయ్య విద్యాలయానికి వచ్చిన విషయం వాస్తవమేనని ధ్రువీకరించారు.