ఎన్నికల ముందు క్వింటాల్ వడ్లకు 500 చొప్పున బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత సన్నవడ్లకు మాత్రమేనంటూ మాటమార్చింది. అయినా బోనస్ చెల్లింపుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదు. పోయిన యాసంగి సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 4.50లక్షల మంది రైతుల నుంచి 23.36లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం కొన్నది. కానీ, ఇప్పటికీ 1,300కోట్ల బోనస్ చెల్లించలేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నా బోనస్ డబ్బులు ఎందుకు ఇప్పించడం లేదు. పెద్దపల్లి జిల్లాకు 39.67కోట్లు, జగిత్యాల జిల్లాకు 23కోట్ల బోనస్ రావాల్సి ఉన్నది. ఈ బకాయిలపై మంత్రి లక్ష్మణ్‌కుమార్ సమాధానం చెప్పాలి.
– కొప్పుల ఈశ్వర్
ధర్మారం, అక్టోబర్ 26: రైతు ప్రభుత్వమంటూ చెప్పుకొంటున్న కాంగ్రెస్ మొదటి నుంచి రైతులను దగా చేస్తున్నదని, యాసంగి సీజన్లో కొనుగోలు చేసిన సన్నవడ్లకు నేటికి బోనస్ డబ్బులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. అసలు బోనస్ చెల్లిస్తుందా.. లేదా ఎగవేస్తుందా..? అనేదానిపై స్పష్టతనివ్వాలని అల్టిమేటం జారీ చేశారు. వానకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యం దిగుబడులు కేంద్రాల్లో పేరుకుపోతున్నాయని, కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ధర్మారం మండలం మల్లాపూర్‌లోని కొనుగోలు కేంద్రంలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఆదివారం ఆయన స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు.
కాంగ్రెస్ హయాంలో తాము తీవ్రంగా నష్టపోయామని, వానకాలం సీజన్లో యూరియా సకాలంలో అందక దిగుబడులు తగ్గిపోయాయని వాపోయారు. అనంతరం రైతులను కొప్పుల ఈశ్వర్ ఓదార్చారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రైతులకు అనేక హామీలు ఇచ్చి మోసగించిందని ధ్వజమెత్తారు. రైతులందరికీ రుణమాఫీ చేయలేదని, రైతుభరోసా కొందరికే జమ చేసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో ఏదో కారణం చేత ధాన్యం తూకంలో ఏదో కొంత కోత పెడితే నాడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గగ్గోలు పెట్టి ప్రభుత్వాన్ని నిందించారని గుర్తు చేశారు. పోయిన యాసంగి సీజన్లో తరుగు, తాలు పేరిట బస్తాకు 3కిలోల వరకు దోపిడీ చేస్తే ఆ సొమ్ము లక్ష్మణ్‌కుమార్ జేబులోకి వెళ్లిందా..? లేదా సీఎం జేబులోకి వెళ్లిందో.. ఆయనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
గతంలో తమ ప్రభుత్వం తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని కొని రైతులకు అండగా నిలిచిందని చెప్పారు. ఇప్పుడు అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని లక్ష్మణ్ కుమార్ కొనుగోలు చేయించి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని సవాల్ విసిరారు. కార్యక్రమంలో నందిమేడారం పీఏసీఎస్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, వైస్ చైర్మన్ సామంతుల రాజమల్లయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్లు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, గుర్రం మోహన్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, మల్లాపూర్, పత్తిపాక మాజీ సర్పంచులు గంధం రవీందర్, బద్ధం సుజాత, పత్తిపాక సింగిల్ విండో డైరెక్టర్ బద్ధం రవీందర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.