Indiramma house | ధర్మారం, జూన్ 23: తాను కాంగ్రెస్ కార్యకర్తనని, వికలాంగుడైన తాను ఇందిరమ్మ ఇంటి మంజూరుకు అర్హుడను అయినప్పటికీ తనకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇల్లు మంజూరు కాక తనకు తీవ్రమైన అన్యాయం జరిగిందని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కమ్మర్ ఖాన్ పేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త జవ్వాజి మదునయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. తాను పార్టీ నాయకులకు, రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు విన్నవించినా తనకు ఇల్లు మంజూరు చేయలేదని వాపోయాడు.
తనకు ఇప్పటికైనా న్యాయం చేసి ఇందిరా ఇంటిని కేటాయించాలని కోరుతూ సోమవారం పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్షకు ప్రజావాణిలో మధునయ్య ఫిర్యాదు చేశాడు. అనంతరం ఆ ఫిర్యాదు పత్రాన్ని‘నమస్తే తెలంగాణ’కు పంపించాడు. ఈ సందర్భంగా మధునయ్య మాట్లాడుతూ వికలాంగుడి నైనా తాను ఇందిరమ్మ ఇంటి పథకంలో ఇల్లు మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్నానని తెలిపారు. తనకు ఇల్లు మంజూరైనట్లు తమ గ్రామంలో జరిగిన గ్రామసభలో అధికారులు ప్రకటించారని, అయితే తుది జాబితాలో తన పేరు గల్లంతయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయాన్ని గ్రామపంచాయతీ కార్యదర్శి వివరణ కోరగా తనతో పాటు ఇందిరమ్మ కమిటీ సభ్యులు కలిసి అర్హుల జాబితా ఎంపిక కోసం పంపామని మధు వివరించారు. తాను ఒక వికలాంగుడిందని తాను ఇల్లు కట్టుకోవడానికి ఖాళీ స్థలం కూడా ఉందని కార్యదర్శికి వివరించగా ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడని కలెక్టర్ కు చేసిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. గ్రామంలో ఎలాంటి విచారణ జరపకుండానే ఈనెల 16న గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన వారికి అధికారులు ముగ్గురు పోశారని ఆయన వివరించారు.
ఇదివరకు గృహ నిర్మాణ పథకంలో లబ్ధి పొందిన వారికి, గృహ నిర్మాణ పథకంలో వచ్చిన ఇండ్లను అమ్ముకున్న వారికి ప్రస్తుతం ఇందిరమ్మ పథకంలో ఇండ్లను అధికారులు మంజూరు చేశారని మధునయ్య ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అన్ని అర్హతలు ఉన్న తనకు ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేసి న్యాయం చేయాలని మధునయ్య జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.