రాజన్న సిరిసిల్ల, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : కార్మిక క్షేత్రం సిరిసిల్లలో నూలు డిపో పెట్టాలనే డిమాండ్ ఏళ్లుగా ఉన్నది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంపై ఆసాములు, యజమానుల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. వేములవాడలో గుడి ఉంటే సిరిసిల్లలో హుండీలు పెట్టినట్లు.. దాదాపు పరిశ్రమ అంతా సిరిసిల్లలో ఉంటే.. వేములవాడలో యారన్ డిపో ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తున్నది. నిజానికి రాష్ట్రంలోనే అతి పెద్ద మరమగ్గాలు సిరిసిల్లలోనే ఉన్నాయి. అన్నీ కలిపి దాదాపు 30వేలకుపైనే ఉన్నాయి. సిరిసిల్ల పట్టణంలో నూలు అవసరం చాలా ఉంటుంది. వేములవాడ చుట్టుపక్కల రెండువేలకు మించి మగ్గాలు లేవు. ఆసాములు, యజమానులకు అవసరం పడే నూలు 12 కిలోమీటర్ల దూరం వెళ్లి తీసుకురావాలంటే రవాణా చార్జీలు భారం కానున్నాయి. చిన్న చిన్న ఆసాములు తక్కువ సంఖ్యలో కొనుగోలు చేసుకుంటారు. అలాంటి వారికి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. పెద్దూరులోని అప్పారెల్ పార్క్, లేదా టెక్స్టైల్స్ పార్కులోని గోదాముల్లో ఏర్పాటు చేస్తే తమ ఇబ్బందులు తీరుతాయని చెబుతున్నారు. సాంచాల సప్పుళ్లే లేని ధార్మిక క్షేత్రంలో యారన్ బ్యాంకు పెట్టడం వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుందని ప్రశ్నిస్తున్నారు.
సిరిసిల్లలో దాదాపు 30వేల మరమగ్గాలున్నయ్. నూలు బ్యాంకు కావాలని కొన్నేళుగా అడుగుతున్నం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. కానీ మాకు అనుకూలంగా లేకపోవడం బాధాకరం. మాకు రోజు నూలు అవసరమే ఉంటుంది. పెట్టుబడి లేని మేము ఎంతో కొంత తెచ్చుకునేందుకు వేములవాడ వెళ్లాలంటే అసౌకర్యంగా ఉంటుంది. రాను పోను 25కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. పైగా అక్కడ సాంచాలు లేవు. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.