Former Minister Jeevan Reddy | జగిత్యాల, ఆగస్టు 4 : ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లే కేటాయించాలని, జిల్లా కలెక్టర్‌కు ఇందిరమ్మ లబ్ధిదారులతో కలిసి వినతిపత్రం అందించారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ నుండి మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సోమవారం కలెక్టరేట్‌కు తరలివెళ్లారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో ఇల్లు కోల్పోయిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి ప్రజావాణిలో సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. లబ్ధిదారులకు గతంలో కేటాయించిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాల కాగితాలు కలెక్టర్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో ఇల్లు కోల్పోయామని, తమని ఆదుకోవాలని నిరుపేదలు జీవన్ రెడ్డికి లబ్ధిదారులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. బిందెలతో నీళ్ళు మోసుకొని ఇల్లు నిర్మించుకున్నామని, కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వద్దు, మాకు ఇందిరమ్మ ఇళ్లే కావాలి, మా ఇల్లు మాకు కావాలని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు మోర పెట్టుకున్నారు. అనంతరం మాజీ మంత్రి జీవన్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. 2008లో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసిందని, డబుల్ బెడ్రూమ్ నిర్మాణంలో ఇల్లు కోల్పోయిన లబ్ధిదారులకు అందరికీ ఇల్లు మంజూరు చేయాలన్నారు. అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మంజూరులో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
అర్హతకు అనుగుణంగా ఇల్లు మంజూరు చేయాలి. వివిధ దశల్లో ఉన్న 1611పరిశీలించి 52 కోట్లు అవసరం అవుతాయని నివేదిక ఇచ్చారని గుర్తు చేశారు. 3500ల డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించి రెండేళ్లు గడుస్తున్న కేవలం 500 మంది మాత్రమే ఇళ్లలోకి చేరారని, మిగిలిన వారు సైతం ఇళ్లలోకి వెళ్ళేందుకు గడువు విధించాలని కోరారు. వీరి కోసం పాఠశాల, ప్రార్థన మందిరాలు నిర్మించాలని సూచించారు. 2008లో ఉమ్మడి రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు మంజూరు చేసేందుకు ఇందిరమ్మ గృహ నిర్మాణం పథకం కింద రాష్ర్టంలో ఎక్కడ లేని విధంగా జగిత్యాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు భూసేకరణ చేపట్టి 4000 మందికి ఇల్లు కేటాయించామన్నారు.
4000 మంది లబ్ధిదారులను ఎంపిక చేసిన ఇళ్లలో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని, తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు అనంతరం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మాణంలో ఉన్న ఇళ్లకు నిధులు కేటాయించకుండా ఇళ్లను నిలిపి వేశారని, ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తే కాంగ్రెస్‌కు ఎక్కడ పేరు వస్తుందోనని వివిధ దశల్లో ఉన్న 2000 ఇళ్లను కూల్చివేసి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం తెర పైకి తీసుకు వచ్చారన్నారు. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం చేపట్టామని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇల్లు కూల్చివేయడంతో నిరాశ్రులయ్యారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నిరుపేదల్లో ఆశలు చిగురించాయని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో ఇల్లు కోల్పోయామని, ఇళ్ల మంజూరిలో ప్రాధాన్యత ఇచ్చి, ఇల్లు కేటాయించాలని లబ్ధిదారులు కోరుతున్నారన్నారు.
ఇందిరమ్మ గృహ నిర్మాణం పథకంలో కేటాయించిన ఇల్లు వివిధ దశల్లో ఉన్నాయని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మౌలిక వసతుల కల్పనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తే ఇళ్ల నిర్మాణాలు పరిశీలించాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేయగా, నిర్మాణాలు పూర్తి చేసేందుకు రూ 52 కోట్లు అవసరం అవుతాయని కలెక్టర్ పరిశీలించి నివేదిక సమర్పించారు.
3500 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించి 20 నెలలు గడుస్తున్నాయని, ఎన్నికలకు ముందుగా ఎంటువంటి మౌలిక వసతులు కల్పించకుండా ఇల్లు కేటాయించారని, సీఎం రేవంత్ రెడ్డి మౌలిక వసతుల కల్పన కోసం నిధులు మంజూరు చేశారన్నారు. 3000 మంది లబ్ధిదారులు ఇప్పటికీ ఇళ్లలోకి చేరాల్సిన అవసరం ఉందని, పాఠశాల, ప్రార్థన మందిరాలు ఏర్పాటు చేయాలని, తాత్కాలికంగా పాఠాశాల, బస్తీ దవాఖాన ఏర్పాటు చేయాలని, ప్రార్థన మందిరాల కోసం దాదాపు 20 ఎకరాలు ఖాళీ స్థలం ఉందని, ఆలయ నిర్మాణం, మసీదు, చర్చ్ నిర్మాణానికి స్థలం కేటాయించాలన్నారు. అర్బన హౌసింగ్ కాలనీలో పోలీస్ ఔట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని, అర్బన్ హౌసింగ్ కాలనీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడంతో పాటు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని కలెక్టర్ సానుకూలంగా స్పందించారన్నారు. ఇల్లు లేని ప్రతి నిరుపేద సొంత ఇంటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నిజం చేస్తుంది అని జీవన్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ ఇళ్ళ లబ్దిదారులు, తదితరులు పాల్గొన్నారు.