కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు సర్వేలకే పరిమితమైంది. అధికారులు పదే పదే సర్వేలు చేయడం, స్థలాల వద్ద ఫొటోలు తీసుకోవడం, ఇదిగో వస్తుంది.. అదిగో వస్తుంది అనడం తప్ప వచ్చేది లేదు, ఇచ్చేది లేదన్నట్టుగా పరిస్థితి మారింది. ఇప్పటికే రెండుసార్లు సర్వేలు చేసిన అధికారులు, నాలుగైదు రోజుల కిత్రం మరోసారి సర్వే చేయడం విమర్శలు తావిస్తున్నది. ఇప్పటికీ కనీసం ఇందిరమ్మ కమిటీలు కూడా వేయకపోవడం, ఇండ్లు మంజూరు చేయకపోవడంపై నగరవాసుల నుంచి తీవ్ర అసహనం వ్యక్తమవుతున్నది.
కరీంనగర్ కార్పొరేషన్, సెప్టెంబర్ 3 : రాష్ట్ర ప్రభుత్వం అన్ని నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నా.. కరీంనగర్ నియోజకవర్గంలో మాత్రం అతిగతీ లేకుండా పోయింది. ఇంత వరకు ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదు. కానీ, లబ్ధిదారుల ఎంపిక పేరిట నగరపాలక సంస్థ అధికారులు మాత్రం పదే పదే సర్వేలు చేస్తుండడంపై నగరవాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలల కిత్రమే నగరంలో సుమారు 1700 మంది లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి సర్వేలు చేసి, దరఖాస్తుదారుల స్థలం వద్ద ఫొటోలు, డాక్యుమెంట్లు, తదితర అన్ని వివరాలు తీసుకున్నారు. ఆ మేరకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందన్న భరోసా కూడా కల్పించారు. కానీ, ఇండ్ల మంజూరు లేక దరఖాస్తుదారులు నగరపాలక సంస్థ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
అధికార కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న కుమ్ములాటల కారణంగానే కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయలేదని తెలుస్తున్నది. దీంతో అధికారులు లబ్ధిదారుల జాబితా సిద్ధం చేసినా ఇళ్లు మంజూరు చేయలేదు. గతంలో ఇందిరమ్మ కమిటీలకు సంబంధించి నియోజకవర్గ ఇన్చార్జి, నగర అధ్యక్షుడు వేర్వేరుగా రెండు జాబితాలు పంపినట్టు తెలిసింది. దీంతో పార్టీ అధిష్టానం కూడా ఎటూ తేల్చకుండానే పక్కన పెట్టింది. కాగా, గతంలో నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న నాయకుడు సస్పెండ్ కావడంతో ప్రస్తుతం ఎవరినీ నియమించలేదు.
ఈ క్రమంలో ఈ బాధ్యతలను వెలిచాల రాజేందర్రావుకు అప్పగిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతున్నది. నగరపాలక సంస్థ ఎన్నికల బాధ్యతలు చూసుకోవాలని ఇప్పటికే ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పినట్టు సమాచారం. మరోవైపు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఉన్న నాయకులకే అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ కూడా కాంగ్రెస్ నేతలు అధిష్టానం ముందు పెట్టినట్టు తెలుస్తున్నది. అయితే, ఆయా వర్గాల మధ్య సాగుతున్న వైరం వల్లే ఇందిరమ్మ కమిటీల నియమాకం ఆలస్యమవుతున్నట్టు తెలుస్తుండగా, దరఖాస్తుదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
ఇందిరమ్మ కమిటీలు లేకుండానే అధికారులు మాత్రం పదే పదే సర్వేలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడు ఇస్తారో తెలియని ఇండ్ల కోసం పదే పదే సర్వేలు ఎందుకనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ క్రమంలో దరఖాస్తుల నుంచి తమకు ఒత్తిళ్లు వస్తున్నాయని కాంగ్రెస్కు చెందిన మాజీ కార్పొరేటర్లు, డివిజన్ల నాయకులే అభిప్రాయపడుతున్నారు.
దీంతో పాటు గతంలోనే రెండు సార్లు అధికారులు దరఖాస్తులను పరిశీలించి, ఆయా దరఖాస్తుదారులకు సంబంధించిన ఖాళీ స్థలాల ఫొటోలు, ఇతర వివరాలను తీసుకోగా.. ఇప్పుడు మరోసారి సర్వే చేయడంపై దరఖాస్తుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కమిటీలు నియమాకమైతే మరోసారి సర్వే చేస్తారా..? అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇళ్ల కోసం నగరపాలక సంస్థకు ఇంకా భారీగా దరఖాస్తులు వస్తుండగా, కరీంనగర్ నియోజకవర్గంలో ఇళ్ల కోసం ఇంకెన్ని రోజులు వేచి చూడాల్సి వస్తుందోనని నగరవాసులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.