సిరిసిల్ల టౌన్, జూలై 14 : ఇందిరమ్మ ఇండ్ల పథకం కాంగ్రెస్ కార్యకర్తలకే పరిమితమైందని, అర్హులకు ప్రభుత్వం మొడి చేయి చూపుతున్నదని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు. ఇసుక ధరలు ఇష్టానుసారంగా పెంచి ఇండ్ల లబ్ధిదారులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి అందించామని, కేటీఆర్ నాయకత్వంలో సిరిసిల్లలోని మండెపల్లిలో 2వేలు, శాంతినగర్‌లో 200, రగుడులో 100, పెద్దూరులో 500 ఇండ్లతోపాటు నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, తంగళ్లపల్లి మండలాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించామన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న 5 లక్షలతో ఇంటి నిర్మాణం సాధ్యమవుతుందా..? అని ప్రశ్నించారు.
ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తామని చెప్పారని, కానీ, నేడు వేలాది రూపాయలు వెచ్చిస్తున్నా లబ్ధిదారులకు ఇసుక సరిపడా దొరకడంలేదన్నారు. మానేరు వాగు తలాపునే ఉన్న సిరిసిల్ల, తంగళ్లపల్లిలో ట్రాక్టర్ ఇసుకపై 3 వేల నుంచి 4 వేల వరకు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఒక ఇంటి నిర్మాణానికి దాదాపు 25 ట్రాక్టర్ల ఇసుక అవసరమవుతుందని, ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల్లో రూ.లక్షకు పైగా ఇసుక కొనేందుకే సరిపోతుందన్నారు.
గతంలో బీఆర్ఎస్పై అడ్డగోలు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలకు నేడు కండ్ల ముందు జరుగుతున్న ఇసుక దోపిడీ కనిపించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ నేతలు చెప్పిన వారికి మాత్రమే ఇసుక కూపన్లు ఇస్తున్నారని చెప్పారు. ప్రజల నుంచి ఛీత్కరించబడిన నాయకుడు వేదికల పైకి వచ్చి ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పంపిణీ చేయడం సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్లకు 6 వేల చొప్పున ఇసుక అమ్ముతుంటే జిల్లా యంత్రాంగం చోద్యం చూస్తున్నదని ఆరోపించారు.
గతంలో వెయ్యి ఉన్న ఇసుక ధర ఇష్టానుసారంగా పెంచి అమ్ముతుంటే కలెక్టర్ దృష్టికి రాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. గత మున్సిపల్ పాలకవర్గంలో 104 ఇండ్ల పంపిణీకి సంబంధించి కలెక్టర్ పర్యవేక్షణలో తెచ్చిన ప్రొసీడింగ్‌ను నిలిపివేశారని, తాము సూచించిన వారిని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టి కొత్త వారికి ఇస్తున్నారని తెలిపారు. కొత్త వారితోపాటు తమ పాలకవర్గం సూచించిన వారందరికీ ఇండ్లు ఇవ్వకపోతే బీఆర్ఎస్ తరఫున పోరాడుతామని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, గుండ్లపల్లి పూర్ణచందర్, గుండారపు కృష్ణారెడ్డి, ఎండీ సత్తార్, సురేశ్‌నాయక్ పాల్గొన్నారు.