Indiramma House | జగిత్యాల, ఏప్రిల్ 23 : సొంత ఇళ్లు లేని వారిని మొదట గుర్తించాలని, వారికే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం లబ్ధిదారుల అర్హత పరిశీలించేందుకు అధికారులకు బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అడిషనల్ కలెక్టర్ బిఎస్ లతతో కలిసి పాల్గొని మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టబడిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకం ద్వారా ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం సొంత స్థలం కలిగి ఇండ్లు లేని నిరుపేదలను గుర్తించుట కోసం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో నలుగురిని గెజిటెడ్ స్పెషల్ ఆఫీసర్ లను మండలాల వారిగా కమిటీలు ఏర్పాట్లు చేసి పకడ్బందీగా అవకతవకలకు తావు లేకుండా కలెక్టర్ అధికారులకు సూచించారు. ఇల్లు లేని నిరుపేదలు దరఖాస్తులు చేసుకున్న వారికి పకడ్బందీగా వెరిఫికేషన్ చేయాలని అధికారులను సూచించారు.
రాష్ట్ర అధికారాలకు ఆదేశాలు, సూచనలు పాటిస్తూ ఆయా గ్రామంలోని ఇందిరమ్మ కమిటీల ద్వారా దరఖాస్తుల జాబితాలను పరిశీలిస్తూ ఇల్లు లేని నిరుపేదలకు గుర్తించాలని అధికారులు ఆదేశించారు. సొంత ఆర్ సి సి ఇల్లు కలిగి ఉండరాదని, 2.5 ఎకరాల పైన వ్యవసాయ భూమి కలిగి ఉండొద్దని, సొంత కారు ఉండరాదని, కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఉండొద్దని తెలిపారు. అలాగే వలస వెళ్లిన వారు, ఆదాయపు పన్ను చెల్లించిన వారు అర్హులు కాదని తెలిపారు. లబ్ధిదారులు తప్పనిసరిగా దరిద్ర రేఖకు దిగువ ఉన్నవారు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్, రెవెన్యూ డివిజనల్ అధికారులు, ఎంపీడీవో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.