ఏండ్ల నాటి చిరకాల కల సాకారమైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వైద్య విద్య చేరువైంది. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుతో పేద, మధ్యతరగతి విద్యార్థులు డాక్టర్లయ్యే అవకాశం కలిగింది. గతేడాది నవంబర్‌లో జగిత్యాల, రామగుండం వైద్య కళాశాలలు ప్రారంభం కాగా, తాజాగా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ కాలేజీలు మొదలయ్యాయి. శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి వర్చువల్ పద్ధతిలో వీటిని ప్రారంభించగా, ఆయాచోట్ల సంబురం అంబరాన్నంటింది.
వేలాది మందితో ర్యాలీలు తీయగా, దారిపొడవునా ‘జై కేసీఆర్’ నినాదాలతో మార్మోగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్, కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‌తోపాటు ఎమ్మెల్యేలు పాల్గొనగా, వైద్య విద్యార్థులు ఆనందంలో మునిగిపోయారు. మెడిసిన్ కలను నెరవేరుస్తున్న సీఎంకు ‘థ్యాంక్స్ టూ కేసీఆర్’ అంటూ కృతజ్ఞతలు చెప్పారు.
-కరీంనగర్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ)
సిరిసిల్లలో అంబరాన్నంటిన సంబురం
సిరిసిల్ల రెండో బైపాస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా సిరిసిల్ల గులాబీమయంగా మారింది. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు, వేలాది మంది విద్యార్థుల ర్యాలీలతో సందడిగా మారింది. ఇల్లంతకుంట, తంగళ్లపల్లి బోయిన్పల్లి మండలాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు సెస్ కార్యాలయం నుంచి, గంభీరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండల నేతలు కొత్త బస్టాండ్‌లోని తెలంగాణ తల్లి విగ్రహం నుంచి, వేములవాడ నియోజకవర్గంలోని అన్ని మండలాల నేతలు నేతన్న చౌక్ నుంచి అంబేద్కర్ చౌరస్తాకు ర్యాలీగా చేరుకున్నారు.
ప్లకార్డులు, జెండాలతో సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కృతజ్ఞత ర్యాలీలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. సెస్ కార్యాలయం నుంచి ఓపెన్ టాప్ జీపులో అంబేద్కర్ చౌక్‌లోని సభాస్థలికి చేరుకొని, అక్కడ ప్రసంగించారు. అంతకు ముందు మంత్రి కేటీఆర్ మెడికల్ కళాశాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సీఎం కేసీఆర్ ఆన్లైన్లో మెడికల్ కాలేజీని ప్రారంభించగా, తిలకించారు. ఆ తర్వాత విద్యార్థులు, అధ్యాపకులతో మాట్లాడారు.
ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్లు జిందం కళ, రామతీర్థపు మాధవి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, సెస్ చైర్మెన్ చిక్కాల రామారావు, ఆర్బీఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, జడ్పీ వైస్ చైర్మన్ సిద్దం వేణు, మాజీ ఎమ్మెల్యే మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా వాసుల చిరకాల కల నెరవేరింది. ఇన్నాళ్లూ అందని ద్రాక్షలా ఉన్న వైద్య విద్య చేరువైంది. ఓ వైపు వైద్య విద్య, మరోవైపు ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేసే లక్ష్యంతో రాష్ట్ర సర్కారు జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసింది. గతేడాది నవంబర్ 15న జగిత్యాల, రామగుండంలో ఏర్పాటు చేయగా, తాజాగా మిగిలిన కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోనూ ప్రారంభించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ నుంచి వర్చువల్‌గా ఈ కాలేజీలను ప్రారంభించగా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్, కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‌తోపాటు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఆయాచోట్ల వేలాది మంది విద్యార్థులతో ర్యాలీలు తీశారు.
– కరీంనగర్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్
కరీంనగర్లో అదిరిన వేడుక
కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో సుమారు 10 వేల మంది విద్యార్థులు, ప్రజలతో భారీ ర్యాలీ తీశారు. రేకుర్తి కిమ్స్ మహిళా డిగ్రీ కళాశాల నుంచి కొత్తపల్లిలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల దాకా వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. మంత్రితోపాటు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తోపాటు ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, రాష్ట్ర సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, మేయర్ సునీల్ రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, కలెక్టర్ జీ గోపి, సీపీ సుబ్బారాయుడు, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శీలం లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో కరీంనగర్, జగిత్యాల ప్రధాన రహదారిపై ఇసుక వేస్తే రాలని పరిస్థితి కనిపించగా, వివిధ వేషధారణలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి గంగుల కమలాకర్ ఈ విద్యార్థులను ఉద్దేశించి కొద్దిసేపు ప్రసంగించారు. ఆ తర్వాత వినోద్, ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి మెడికల్ కాలేజీ ఆడిటోరియం భవనాన్ని ప్రారంభించారు.
అనంతరం సీఎం కేసీఆర్ ప్రారంభోత్సవ ప్రత్యక్ష ప్రసారాన్ని గోదాం ఆవరణలో ఏర్పాటు చేసిన స్క్రీన్ వద్ద వివిధ కళాశాలల విద్యార్థులు, ఆడిటోరియంలో మంత్రి, వినోద్, ఎమ్మెల్యేలు, అధికారులు, వైద్య విద్యార్థులు, ఫ్యాకల్టీ, సిబ్బంది తిలకించారు. సీఎం ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. అనంతరం ఆడిటోరియంలో మెడికల్ విద్యార్థులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు.