దళితబిడ్డలు తమకు రావాల్సిన దళితబంధు రెండో విడుత ఆర్థికసాయం అడుగడమే పాపమవుతున్నది. హుజూరాబాద్ నియోజకవర్గానికి కాదు, జిల్లాకు ఏ వీఐపీ వచ్చినా ప్రభుత్వం నిర్బంధం మోపుతున్నది. చివరకు పొరుగున ఉన్న వరంగల్ జిల్లాకు సీఎం వస్తున్నా.. అరెస్టుల పర్వం కొనసాగుతున్నది.
కరీంనగర్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ)/ హుజూరాబాద్ : దళితబంధు రెండో విడుత ఆర్థిక సాయం కోసం హుజూరాబాద్ నియోజకవర్గ దళితబిడ్డలు పదకొండు నెలలుగా తండ్లాడుతున్నారు. దళితబంధు సాధన సమితి పేరిట ఒక వేదికను ఏర్పాటు చేసుకొని నిరసనలు తెలుపుతున్నారు. తమ బ్యాంకు ఖాతాల్లో ఉన్న ఆర్థిక సహాయాన్ని విడిపించుకునే అవకాశం ఇవ్వాలని అధికారులు, మంత్రులు, అధికార పార్టీ పెద్దలను అనునిత్యం వేడుకుంటూనే ఉన్నారు. వారి విన్నపాన్ని పరిశీలించి న్యాయం చేయాల్సిందిపోయి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. రెండో విడుత ఆర్థిక సహాయం దేవుడెరుగు.. జిల్లాకు ఏ వీఐపీ వచ్చినా లబ్ధిదారులను పోలీసుస్టేషన్లలో నిర్బంధిస్తున్నది. చివరకు పొరుగున ఉన్న వరంగల్ జిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి వస్తున్నా వదిలిపెట్టడం లేదు. మంగళవారం సీఎం వరంగల్ పర్యటన నేపథ్యంలో సోమవారం ఉదయం నుంచే అరెస్టులు కొనసాగించారు.
ముఖ్యంగా నిరసనల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వారిని వేటాడారు. హుజూరాబాద్‌లో ముగ్గురిని, వీణవంకలో ఐదుగురిని, జమ్మికుంటలో ఎనిమిది మందిని, ఇల్లంతకుంటలో మరో నలుగురిని అరెస్టు చేశారు. అయితే, వీరిలో కొందరు గ్రూప్-3 రాయాల్సి ఉందని చెప్పినా వదిలి పెట్టలేదని తెలిసింది. కొందరు పరీక్ష రాసేందుకు తెల్లవారుజామునే వెళ్లగా, అలాంటి వారి ఇండ్ల వద్ద పోలీసులు కాపలా ఉండి, వారు ఇంటికి రాగానే స్టేషన్‌కు తీసుకెళ్లారు. జమ్మికుంటకు చెందిన ఓ లబ్ధిదారు గ్రూప్-3 రాసేందుకు కరీంనగర్ వెళ్లగా, ఆయన ఇంటి వద్ద ఇద్దరు కానిస్టేబుళ్లను ఉంచినట్లు తెలిసింది. ఇంటి వద్ద పోలీసులు ఉన్నారని తెలియడంతో ఇంటికి రాకుండా ఉన్నా.. కూతురుకు జ్వరం రావడంతో తప్పని సరై ఇంటికి వచ్చి దవాఖానకు తీసుకెళ్లాడు. అయినా పోలీసులు అక్కడికి కూడా తమ వాహనంలో వెళ్లి స్టేషన్‌కు రావాలని హుకుం జారీ చేశారు. ఏదో నేరం చేసినట్టు ఇండ్లలోకి వచ్చి తీసుకెళ్లడం, ఇంట్లో లేకుంటే వచ్చేంత వరకు అక్కడే ఉండి పట్టుకెళ్లడం, స్టేషన్‌కు తీసుకెళ్లి నిర్బంధించడంతో తాము మానసికంగా కుంగిపోతున్నామని దళితులు వాపోతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సభలో నిరసన తెలిపే ఆలోచన తమకు లేకున్నా ఇలా నిర్బంధించడం సరికాదని స్పష్టం చేస్తున్నారు. అయితే, సీఎం సభలో మహిళలతో నిరసన తెలుపాలని వాట్సాప్ గ్రూప్‌లో ఒక వాయిస్ మెసేజ్ వచ్చిందని, దాంతో తమకు సంబంధం లేదని, అయినా తమను ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారని దళితబంధు సాధన సమితి బాధ్యులు వాపోతున్నారు.
కూతురిని దవాఖానకు తీసుకొచ్చినా..
జమ్మికుంటకు చెందిన దళితబంధు లబ్ధిదారుడు కొలుగూరి సురేశ్ అనారోగ్యంతో ఉన్న తన కూతురిని స్థానిక ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లగా, సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లారు. ‘సార్ పిలుస్తున్నారు’ అని రమ్మని చెప్పగా.. తన కూతురు జ్వరంతో బాధపడుతున్నదని, డాక్టర్‌కు చూపించిన తర్వాత వస్తానని చెప్పాడు. అయినా అక్కడి నుంచి వెళ్లకుండా సమీప బేకరీలో కూర్చుని సురేశ్‌పై ఓ కన్నేసి ఉంచారు. ఏ నేరం చేయని తమని ఎందుకిలా వేధిస్తున్నారో అర్థం కావడం లేదని సురేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనను ఇప్పటికే 19 సార్లు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి నిర్బంధించారని, తాను ఏ నేరం చేయకున్నా ఇలా ఎందుకు వేధిస్తున్నారని మనోవేదనకు గురవుతున్నాడు.
అరెస్ట్ అన్యాయం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన దళితబంధు రెండో విడుత ఆర్థిక సహాయాన్ని అడిగితే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దళితబిడ్డలను పోలీస్ స్టేషన్లలో నిర్బంధిస్తున్నదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక వీడియో సందేశం విడుదల చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం వరంగల్‌కు వస్తున్న నేపథ్యంలో దళితబంధు సాధన సమితి నాయకులు, లబ్ధిదారులను నిర్బంధించడం అన్యాయమని ఖండించారు. హుజూరాబాద్‌లో అధికార పార్టీకి చెందిన ఎవరు పర్యటించినా దళితులను ముందస్తు అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. దళితుల హకులను కాపాడాల్సిన పోలీసులే, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం తీవ్ర ఆవేదన కలిగిస్తున్నదన్నారు. వారి న్యాయమైన హకులను గుర్తించి, వెంటనే వారిని విడిచిపెట్టాలని, లేకుంటే ప్రజలందరితో కలిసి పెద్దఎత్తున ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. రెండో విడుత ఆర్థిక సహాయం విడుదల చేసే వరకు హుజూరాబాద్ దళితుల పక్షాన తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.