Godavarikhani | కోల్ సిటీ, జూన్ 2: తెగించి.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మళ్లీ వెనక్కి పోతున్నదనీ, కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమాని ఆటో డ్రైవర్లకు ఆత్మహత్యలే శరణ్యంగా మారిందని ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ పేర్కొన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా గోదావరిఖనిలో మంగళవారం ఆటో జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కాశిపేట రాజయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంద రవికుమార్ మాట్లాడుతూ ఒకప్రక్క ఆర్టీసీ ఉచిత ప్రయాణం వల్ల గిరాఖీలు లేక ఆటోలకు ఫైనాన్స్‌లు కట్టలేక డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్లకు జీవన భృతి కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా కేంద్ర ప్రభుత్వం వరుసగా పెంచిన డీజీల్, పెట్రోలు ధరలతో ఆటో డ్రైవర్ల బతుకులు మరింత ఆగమయ్యాయని పేర్కొన్నారు. అధికారం కోసం ఆటో డ్రైవర్ల జీవితాలతో చెలగాటం ఆడవద్దన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో ఆటో డ్రైవర్లు సైతం తెగించి కొట్లాడారనీ, కానీ తెలంగాణ వచ్చాక మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఆటో డ్రైవర్ల జీవితాలు బుగ్గిపాలయ్యాయన్నారు. అనంతరం రామగుండం కార్పొరేషన్ ఏరియా అధ్యక్షుడిగా బురహన్, ఉపాధ్యక్షులుగా జబ్బర్, శంకర్, ప్రధాన కార్యదర్శిగా మడిపెద్ది రమేష్, కార్యదర్శి ఎండీ అలీ, రాజయ్యలను ఎన్నుకున్నారు.