Indiramma committees | చిగురుమామిడి, మే 7: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన నిరుపేదలకు అన్యాయం జరుగుతుందని, ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో ఈ జాబితాను రూపొందించడంలో ఆంతర్యం ఏమిటని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, నాయకులతో కలిసి బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇల్లు లేని వారికి, కిరాయి గృహాల్లో ఉన్న వారికి కాకుండా ఇందిరమ్మ కమిటీల పేరుతో మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనుకూలంగా ఉన్న వారికే ఇల్లు మంజూరు చేస్తున్నారని, అర్హులైన లబ్ధిదారులను పక్కన పెడుతున్నారని ఆయన అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకి మండలంలో కాంగ్రెస్ నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారని సోషల్ మీడియా గ్రూపులలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే పోస్టులు పెడుతున్నారని అన్నారు.
హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తక్షణమే స్పందించి మండలంలో అర్హులైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, వీటి ఎంపికలో అధికారులను బలి పశువులను చేయకుండా పూర్తి పారదర్శకతను పాటించాలని వారు డిమాండ్ చేశారు. మొదటి విడతలో ఎంపికైన గునుకుల పల్లె గ్రామపంచాయతీలో ఏఈ సమక్షంలో ముగ్గు పోసిన ఇంటికి బిల్లు రాకుండా అడ్డుకుంటున్నారని, 400 చదరపు అడుగుల నుండి 600 వరకు ఉండాలనే నిబంధనను తొలగించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
నిజమైన అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయకపోతే ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, సింగల్ విండో చైర్మన్ రమణారెడ్డి, మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పెనుకుల తిరుపతి, మండల ప్రధాన కార్యదర్శి పేసరి రాజేశం పాల్గొన్నారు