Karimnagar | స్వరాష్ట్రంలో జిల్లా అన్నింటా దూసుకుపోతున్నది. సకల జనుల హితమే పరమావధిగా ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ సర్కారు, పల్లెపల్లెనూ ప్రగతి పథాన నడిపిస్తున్నది. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో ప్రజల చెంతకు పాలన తెచ్చి, అభివృద్ధిని కళ్ల ముందే చూపిస్తున్నది. కనీవినీ ఎరుగని సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చి, అర్హులైన ప్రతి ఒక్కరికీ వాటి ఫలాలను అందిస్తున్నది. ‘రైతుబంధు’, సాగుకు 24 గంటల ఉచిత కరెంట్‌తో అన్నదాతకు ధీమానిచ్చింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో జిల్లా సస్యశ్యామలమై సేద్యం పండుగలా మారింది. ఇపుడు యాసంగిలో ఒక్క ధాన్యమే 4.50 నుంచి 5 లక్షల మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వస్తోంది. పల్లె, పట్టణ ప్రగతిలో గ్రామాలకు కొత్తందాలు రాగా, జిల్లా దవాఖాన ఆధునీకరణ, పడకల స్థాయి పెంపు, ఇంకా 97 పల్లె దవాఖానాలు, 4 బస్తీ దవాఖానతో వైద్యం చేరువైంది. ఒకప్పుడు అధ్వానంగా ఉన్న గ్రామీణ, పట్టణ రహదారులకు మహర్దశ పట్టగా, మానేరు నదిపై ఏర్పాటు చేసిన కేబుల్ బ్రిడ్జి జిల్లాకే కొత్తశోభ తెచ్చిపెట్టింది. ఇంకా విద్య, శాంతి భద్రతలతోపాటు అన్ని రంగాలకూ సమప్రాధాన్యతనిస్తూ, సబ్బండవర్ణాలకు ప్రభుత్వమున్నదనే ధైర్యం కల్పిస్తున్నది.
కరీంనగర్, మార్చి 15 (నమస్తే తెలంగాణ) స్వరాష్ట్రంలో జిల్లా ప్రగతి పథాన పరుగెడుతున్నది. ఒక పక్క మౌలిక సదుపాయాల కల్పన, మరో పక్క సంక్షేమ పథకాల అమలు.. ఏ రకంగా చూసినా అభివృద్ధిలో టాప్‌గా నిలుస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో స్వరాష్ట్రంలో ప్రగతి పరవళ్లు తొక్కుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఎదురైన ఆటంకాలను అధిగమిస్తూ, అన్నింటా దూసుకెళ్తున్నది. సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ఈ తొమ్మిదేండ్ల వ్యవధిలోనే నాటికి నేటికి ఎంతో తేడా కనిపిస్తున్నది. చిన్న జిల్లాగా మారడంతో మహర్దశ పట్టింది. ఓ వైపు అభివృద్ధి వెలుగులు విరజిమ్ముతుంటే, మరో వైపు సంక్షేమ పూల పరిమళాలు వెదజల్లుతున్నది. ఒక్కమాటలో చెప్పాలంటే, కరీంనగర్ సమగ్రాభివృద్ధి దిశలో పురోగమిస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత జిల్లాలో సాగు విస్తీర్ణం పుష్కలంగా పెరిగింది. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగు చేసేవాళ్లు. ఇప్పుడు ఒక్క కరీంనగర్ చిన్న జిల్లాలోనే 2.50 లక్షల ఎకరాలకు పంటల విస్తీర్ణం పెరిగింది. మూడేళ్ల కింద జిల్లాలో కేవలం 1.55 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యేవి. కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత ఏటేటా విస్తీర్ణం పెరుగుతోంది. ఈ యాసంగి సీజన్లో ఏకంగా 3,01,622 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. దీన్ని బట్టి ఇంత చిన్న జిల్లాలో ఏ మేరకు పంటలు పండుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు చిన్న జిల్లాలో 2-2.50 లక్షల మెట్రిక్ టన్నుల పంటల దిగుబడులు మాత్రమే వచ్చేవి. ఇప్పుడు ఒక్క ధాన్యమే 4.50 నుంచి 5 లక్షల మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి అవుతోంది. గత వానా కాలం సీజన్లో జిల్లా రైతులు చిన్న జిల్లాల ఏర్పాటుతో వ్యవసాయ అధికారులు రైతులతో మమేకమై పంటల సాగును ప్రోత్సహించారు. ఆయిల్ పాం వంటి కమర్షియల్ పంటల సాగుపైనా రైతులు దృష్టి సారిస్తున్నారు.
తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకుని చిన్న జిల్లాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది. 13 నియోజకవర్గాలతో ఉన్న ఉమ్మడి కరీంనగర్ నాలుగు జిల్లాలుగా విడిపోయింది. ఇటు భూపాలపల్లి, హన్మకొండ, సిద్దిపేట జిల్లాల్లో కూడా కరీంనగర్ భౌగోళిక ప్రాంతాన్ని కలపడంతో ప్రజలకు పాలన మరింత చేరువైంది. పూర్వం 1,207 గ్రామ పంచాయతీలు, 57 మండలాలు, 5 రెవెన్యూ డివిజన్లతో విస్తరించి ఉన్న కరీంనగర్ జిల్లాను 2016లో రెండు డివిజన్లు,16 మండలాలు, 276 పంచాయతీలతో కొత్త జిల్లాగా ఏర్పాటు చేశారు. అనంతరం 17 పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేసి కొత్తగా మరో 54 పంచాయతీలను ఏర్పాటు చేశారు. అప్పుడు 16 మండలాలు, 313 పంచాయతీలతో భౌగోళికంగా కొత్త జిల్లా ఏర్పాటైంది. జిల్లా కేంద్రానికి చివరలో ఉన్న మండల కేంద్రం కూడా 40 కిలోమీటర్ల పరిధికి వచ్చేసింది. దీంతో గంట వ్యవధిలో జిల్లాలో ఎక్కడి నుంచైనా జిల్లా కేంద్రానికి చేరుకునే అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో ప్రజలకు తమ అవసరాలకు జిల్లా కేంద్రానికి సులువుగా వచ్చి వెళ్తున్నారు. మునుపటి పరిపాలన పరిధి తగ్గడంతో అధికారులు సైతం ప్రజల అవసరాలను ఎప్పటికపుడు తీర్చుతున్నారు. చిన్న జిల్లాగా ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పథకాలపై పర్యవేక్షణ పెరిగింది. అభివృద్ధికి సరైన ప్రణాళికలు వేయడం, అనుకున్న సమయంలో అమలు చేయడంతో ఇటు అభివృద్ధిలోనే జిల్లా దూసుకుపోతున్నది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత మత్స్య కారుల జీవితాలు పూర్తిగా మారిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత చెరువుల్లో పుష్కలంగా నీటి వనరులు ఉంటున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎల్ఎండీ రిజర్వాయర్‌లో పుష్కలంగా నీరు నిల్వ ఉంటోంది. 8 వేల హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ రిజర్వాయర్‌లో ఏటా మత్స్య సంపదను వృద్ధి చేస్తున్నారు. జిల్లాలో 13,483 మంది సభ్యులతో 177 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. 461 మంది సభ్యులు కలిసి మార్కెటింగ్ సొసైటీని ఏర్పాటు చేసుకునే స్థాయికి వచ్చారు. 766 గ్రామాల్లోని 908 చెరువుల పరిధిలోని 21,292 హెక్టార్లలో చేపల ఉత్పత్తి చేపట్టారు. గతేడాది 11,173 టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుని 8,126.52 టన్నులు ఉత్పత్తి చేశారంటే మామూలు విషయం కాదు. ఇటు 268 టన్నుల రొయ్యలు కేవలం ఎల్ఎండీ రిజర్వాయర్‌లోనే ఉత్పత్తి చేశారు. మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సహిస్తోంది.
చిన్న జిల్లాగా ఏర్పడిన తర్వాత సాగు రంగం కూడా అభివృద్ధి చెందుతోంది. కరీంనగర్ జిల్లాలో మొత్తం 1,376 చెరువులు, కుంటలు ఉండగా మిషన్ కాకతీయ నాలుగు విడతల్లో 554 చెరువుల్లో పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఇప్పటి వరకు 458 పనులు పూర్తి చేశారు. కాళేశ్వరం పాజెక్టుతో అనుసంధానించడంతో జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా చివరి ఆయకట్టుకు కూడా పుష్కలంగా సాగు నీరందుతోంది. జిల్లాలో ఎగువ మానేరు పరిధిలోని 22,487, దిగువన ఉన్న 1,8,865 చొప్పున మొత్తం 1,31,352 ఎకరాలకు వానా కాలం, యాసంగి పంటలకు అవసరమైన నీళ్లు అందిస్తున్నారు. ప్రతి సీజన్లో 768 చెరువులను నీటితో నింపుతున్నారు. దీంతో ఎక్కడా పంటలు ఎండిపోయే పరిస్థితి లేకుండా పోయింది. గతంతో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. కాలువల్లో పూడిక తీయక చివరి ఆయకట్టుకు నీళ్లు వెళ్లే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు ఎప్పటికప్పుడు పుష్కలమైన నీటి లభ్యత, కాలువల ఆధునీకరణ కారణంగా చివరి ఆయకట్టుకు కూడా పుష్కలంగా సాగు నీరు అందుతోంది.
ఒకప్పుడు తాగు నీటి కోసం మహిళలు రోడ్లెక్కి ఆందోళన చేయని రోజు ఉండేది కాదు. తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక ప్రజలు అల్లాడేవాళ్లు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన మిషన్ భగీరథ పథకంతో తాగు నీటి గోస తీరింది. ఈ పథకం ద్వారా ఇప్పుడు ఇంటింటికీ తాగు నీరందుతోంది. జిల్లాలో ఇప్పుడు మహిళలు రోడ్డెక్కే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. జిల్లాలోని 469 ఆవాసాలకు క్రమం తప్పకుండా నీరందుతుంది. మిషన్ భగీరథ అధికారులు మూడు సెగ్మెంట్లుగా విభజించి తాగు నీటిని సరఫరా చేస్తున్నారు. ఎల్ఎండీ రిజర్వాయర్ నుంచి కరీంనగర్- రామడుగు సెగ్మెంట్లో 87, ఎల్ఎండీ, మానకొండూర్, హుస్నాబాద్, హుజూరాబాద్ సెగ్మెంట్లో 312, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి సెగ్మెంట్లో మరో 70 ఆవాసాలకు తాగు నీరు అందుతోంది.
చిన్న జిల్లాల ఏర్పాటుతో శాంతి భద్రతల పర్యవేక్షణ చాలా సులువుగా మారింది. స్మార్ట్ పోలీసింగ్‌తో మరింత సులువుగా మారనుంది. కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత కొత్తపల్లి, ఇల్లందకుంట, గన్నేరువరం పోలీసు స్టేషన్లు కొత్తగా ఏర్పాటు చేశారు. కమిషనరేట్ ఏర్పాటు చేశారు. ఇందుకు రూ.5 కోట్లతో కొత్త భవనాన్ని నిర్మించారు. అంతే కాకుండా కరీంనగర్‌లోని వన్, త్రీటౌన్, ఎల్ఎండీ, జమ్మికుంట పీఎస్‌లను మాడల్ ఠాణాలుగా తీర్చిదిద్దారు. ఎల్ఎండీ కట్టపై లేక్ పోలీసు స్టేషన్ ఏర్పాటు చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసులు ఎలా పనిచేస్తున్నారు. బాధితుల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారనే విషయాలను కమిషనరేట్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. రూ.50 కోట్లు వెచ్చించి కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా ఇక్కడి నుంచే కంట్రోల్ చేసే స్మార్ట్ పోలీసింగ్ సిస్టంను డెవలప్ చేస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం, ఆధునాతమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తుండడంతో శాంతి భద్రత పర్యవేక్షణ మరింత సులభతరం కానుంది.
Karimnagar3
రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో జిల్లాలో విద్యావకాశాలు సైతం మెరుగుపడ్డాయి. వివిధ వర్గాలకు విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సామాజిక వర్గాల వారీగా గురుకులాలను ఏర్పాటు చేసింది. మోడల్ స్కూళ్లను ప్రోత్సహించింది. కొత్తగా తెచ్చిన ‘మన ఊరు, మన బడి’, ‘మన బస్తీ మన బడి’ పథకం కింద జిల్లాలో మొత్తం 651 పాఠశాలలు ఉండగా తొలి దశలో 120 ప్రాథమిక, 16 ప్రాథమికోన్నత, 94 ఉన్నత పాఠశాలను ఎంపిక చేసి రూ.31 కోట్లతో 12 రకాల అభివృద్ధి పనులను ప్రతి పాఠశాలలో చేపట్టారు. మైనార్టీ, బీసీ, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థిపై రూ 1.20 లక్షలు ఖర్చు చేస్తూ కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వం విద్యను అందిస్తోంది. అంతే కాకుండా విద్యా వంతులైన యువతీ యువకులకు వివిధ ప్రభుత్వ ఉద్యోగాల ఎంపికకు తర్ఫీదు ఇచ్చేందుకు అంబేద్కర్ స్టడీ సర్కిల్, బీసీ స్టడీ సర్కిల్‌ను కూడా ఏర్పాటు చేసింది. తాజాగా రూ.500 కోట్లతో జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూడా ఏర్పాటు చేసింది. అంతే కాకుండా ప్రభుత్వ డిగ్రీ, ఇంటర్ విద్యను అందించడంలో కూడా ప్రభుత్వం అనేక సంస్కరణలు తెచ్చింది.
చిన్న జిల్లాలో రహదారులకు మహర్దశ పట్టుకుంది. జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు, మండల కేంద్రాల నుంచి ప్రతి గ్రామానికి అనుసంధాం చేస్తూ రోడ్లను విస్తరించారు. ప్రతి నియోజకవర్గంలో ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్ శాఖ ద్వారా అనేక రోడ్లను అభివృద్ధి చేశారు. తెలంగాణ ఏర్పడిన మొదటి ఏడాది నుంచే రాష్ట్ర ప్రభుత్వం రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అదే ఏడాది నవంబర్‌లో సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చేందుకు రూ.248.57 కోట్లు, నాలుగు లైన్ల్ కోసం రూ. 218.85 కోట్లు, వంతెన కోసం రూ. 48.35 కోట్లు ఖర్చు చేసింది. కరీంనగర్ నగరంలోని రోడ్ల విస్తరణ కోసం రూ.247 కోట్లు ఖర్చు చేసింది. మొత్తంగా జిల్లాలోని రోడ్ల విస్తరణకు రూ.1,381.36 కోట్లు ఖర్చుచేసింది. రూ. 183 కోట్లతో నగరం సమీపంలోని మనేరు వంతెనపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణం జిల్లాకు ప్రత్యేక ఆకర్శనగా నిలుస్తోంది. ఇటు పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ. 233.49 కోట్ల ఖర్చుతో రోడ్లను అభివృద్ధి చేసింది.
ఒక పక్క అభివృద్ధి సాధిస్తూనే ప్రభుత్వం సంక్షేమ రంగాన్ని ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. తెలంగాణ రాకముందు ప్రభుత్వ వైద్యం అంటేనే ఈసడించుకున్న ప్రజలు ఇపుడు సర్కారు వైద్యంపై సంపూర్ణ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారు. కరీంనగర్‌లోని ప్రభుత్వ ప్రధాన దవాఖానాను పూర్తి స్థాయిలో ఆధునీకరించారు. గతంలో కేవలం 350 పడకలు మాత్రమే ఉన్న ఈ దవాఖానాలో అదనంగా మరో 150 పడుకలు ఏర్పాటు చేశారు. తాజాగా ఎంసీహెచ్‌లో 100, ప్రభుత్వ దవాఖానాలో ఆరోగ్య మహిళ వార్డు కోసం మరో 65 పడకలు ఏర్పాటు చేశారు. అంతే కాకుండా అన్ని వ్యాధులకు ఒకే చోట వైద్య పరీక్షలు నిర్వహించేందుకు టీ హబ్, ఆర్టిపీసీయార్ ల్యాబ్, రేడియాలజీ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేసి కిడ్నీ సంబంధిత వ్యాధి గ్రస్తులను ఆదుకుంటున్నారు. అన్ని స్థాయిల్లో వైద్యం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ప్రస్తుతం 16 మండలాల్లో 18 ఆరోగ్య కేంద్రాలను నిర్వహిస్తున్నారు. 97 పల్లె దవాఖానాలు, 4 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు కేసీఆర్ కిట్స్‌ను అందిస్తున్నారు.