‘ఇంట గెలిచి.. రచ్చ గెలవాలి’ అంటారు. కానీ, తమ విషయంలో ఇందుకు భిన్నంగా జరుగుతున్నదని అస్సాం నటి సుకన్య బోరువా వాపోతున్నది. తాము బయట గుర్తింపు దక్కించుకున్నా.. స్వదేశంలో మాత్రం నిరాధరణే లభిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నది. ముఖ్యంగా, సినీ పరిశ్రమలో ఈశాన్య రాష్ర్టాలకు రావాల్సినంత గుర్తింపు దక్కడంలేదని ఆరోపిస్తున్నది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సుకన్య.. తమ ప్రాంతాలపై చిన్నచూపు వద్దని కోరింది. “ఈశాన్య రాష్ర్టాలకు దేశవ్యాప్తంగా గౌరవం లభించాలంటే.. అంతర్జాతీయ గుర్తింపు అవసరం లేదు. అది ఇంట్లోనే ప్రారంభం కావాలి. కానీ, ఇక్కడ అలా జరగడం లేదు. ఈ విషయమే మమ్మల్ని నిరాశకు గురిచేస్తున్నది. సిగ్గుచేటుగా అనిపిస్తున్నది” అంటూ ఆవేదన వ్యక్తంచేసింది.
రిమాదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘నాట్ ఏ హీరో’ సినిమాలో కీలకపాత్రలో కనిపించింది సుకన్య బోరువా. ఈ సినిమా 2026 బెర్లిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో క్రిస్టల్ బేర్ అవార్డును గెలుచుకున్నది. ఒక అస్సామీ చిత్రానికి అంతర్జాతీయంగా గుర్తింపు దక్కినా.. స్వదేశంలో మాత్రం పట్టించుకోవడం లేదని సుకన్య చెప్పుకొచ్చింది. తమ ప్రతిభను గుర్తించడం లేదని వెల్లడించింది. “ఎవరు ఎంత పక్షపాతం చూపినా.. ‘కళ’ను మాత్రం అడ్డుకోలేరు. అది నిత్యం ప్రయాణిస్తూనే ఉంటుంది. స్వరాలు ఖండాలు దాటి వినిపిస్తాయి. మన గుర్తింపును ఎవరూ అడ్డుకోలేరని నిరూపిస్తాయి” అంటూ చెప్పుకొచ్చింది.
ఈశాన్య రాష్ర్టాల కళాకారులు ప్రపంచ వేదికలపై గుర్తింపు పొందడం గర్వకారణమనీ, అదే సమయంలో ఒక పెద్ద వాస్తవికతనూ ఈ సంఘటన గుర్తు చేస్తుందని వెల్లడించింది. “తరతరాలుగా మా ప్రాంతం ప్రధాన స్రవంతి కథనాలలో విస్మరణకు గురవుతూ వస్తున్నది. అదే సమయంలో ఈశాన్య ప్రాంతాలు శక్తివంతమైన కథలు, సంగీతం, సినిమాలలో ప్రతిభను చూపుతూనే ఉన్నాయి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మాకు రావాల్సిన గుర్తింపు అదే వస్తుంది” అంటూ ఆశాభావం వ్యక్తం చేసింది. అస్సాం రాష్ర్టానికి చెందిన సుకన్య బోరువా.. నటి, మోడల్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది. పలు హిందీ ప్రాజెక్టులలోనూ పాలుపంచుకున్నది. 2021లో వచ్చిన ‘నిమా డెంజోంగ్పా’ చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ‘నాట్ ఏ హీరో’తో మంచి గుర్తింపు అందుకున్నది.