హైదరాబాద్, మార్చి 14(నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల పథకం రాష్ట్రంలోని పట్టణ పేదలకు అందని ద్రాక్షగానే మిగిలేలా ఉన్నది. ఎన్నికల ముందు నుంచి ఊరిస్తూ వచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటినా పట్టణాల్లో ఆ పథకం అమ లు ఊసే ఎత్తలేదు. కేంద్రం ఇప్పటివరకు కేవ లం 1.31లక్షల ఇండ్లు మాత్రమే మంజూరు చేయగా, పట్టణ పేదల నుంచి వచ్చిన దరఖాస్తులు మాత్రం 25 లక్షలకు పైగా ఉండటమే అందుకు నిదర్శనం. ఇందిరమ్మ ఇండ్ల నిర్మా ణం కోసం కేంద్ర ప్రభుత్వ నిధులపై ఆధారపడుతున్న రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్, రాను న్న రెండున్నరేండ్లలో కనీసం పదో వంతు మందికైనా ఇండ్లు నిర్మిస్తుందో? లేదో? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఐదేండ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వగా, రెండున్నరేండ్లు గడిచినా, ఒక్క ఇల్లు నిర్మాణం కూడా పూర్తికాలేదు. మొదటి విడతలో 4.5లక్షల ఇండ్లు మంజూరు చేయగా, నిర్మాణంలో ఉన్న ఇండ్లు కేవలం 2.70 లక్షలు మాత్రమే. స్థలాల లభ్యత లేకపోవడం వల్ల హైదరాబాద్ సహా ఇతర పట్టణ ప్రాంతాల్లో ఇంతవరకు ఇండ్ల నిర్మాణం చేపట్టనేలేదు. పేదలు నివసిస్తున్న బస్తీల్లోనే వారిని ఖాళీ చేయించి టవర్లు నిర్మించాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ నిర్మా ణం సకాలంలో పూర్తవుతుందో? లేదో? అనే అనుమానంతో చాలామంది ఒప్పుకోవడం లేదు. దీంతో ప్రస్తుతానికి గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఇండ్ల నిర్మాణం కొనసాగుతున్నది.
పట్టణ పేదల కోసం కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) 2.0 కింద ఇప్పటివరకు రాష్ర్టానికి 1,31,213 ఇండ్లు మంజూరు చేసింది. తొలి విడతలో నిరుడు 1.13 లక్షల ఇండ్లకు రూ.1,500 కోట్లు, రెం డో విడతలో 18,213 ఇండ్లకు మరో రూ.27 3 కోట్లు మంజూరు చేసింది. మొత్తం కలిపి కేంద్రం నుంచి రూ.1,773 కోట్లు రానున్నా యి. ఒక్కో ఇంటికి రాష్ట్ర సర్కార్ రూ.5లక్షల చొప్పున ఇస్తున్నది. అందులో కేంద్రం వాటా రూ.1.5 లక్షలు కాగా, మిగతా రూ.3.5 లక్ష లు రాష్ట్ర సర్కార్ భరించాల్సి ఉంటుంది. ఇండ్ల నిర్మాణం చేపడితేనే కేంద్రం నుంచి ని ధులు విడుదలయ్యే అవకాశం ఉన్నది. నిధు లు, స్థలాల కొరత కారణంగా పట్టణ ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణం ఇంకా చేపట్టలేదు.
ఇందిరమ్మ ఇండ్ల కోసం 80 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో 25 లక్షలకు పైగా దరఖాస్తులు నగర, పట్టణ పేదల నుంచే వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా రెండున్నరేండ్ల గడువు మాత్రమే ఉన్నది. ఇప్పటికిప్పుడు ఇండ్ల నిర్మాణం చేపట్టినా కేంద్రం మంజూరు చేసిన ఇండ్ల కన్నా ఎక్కువ ఇండ్లు నిర్మించే అవకాశం కనిపించడమే లేదు. దీంతో దరఖాస్తుల్లో పదో వంతు మందికి కూడా ఇండ్లు నిర్మించే వచ్చే ఆస్కారం కనిపించడంలేదు. హైదరాబాద్ సహా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ తదితర నగరాల్లో ఇండ్ల నిర్మాణానికి కొన్ని బస్తీలను ఎంపిక చేసినప్పటికీ అక్కడ ఇండ్లు నిర్మించేందుకు బస్తీలవాసులు ఒప్పుకోవడం లేదు. వారు ఉంటు న్న గుడిసెలను ఖాళీ చేయించి అక్కడే అపార్ట్మెంట్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే రెండున్నరేండ్లలో ఇండ్ల నిర్మాణం పూర్తికాకుంటే తాము రోడ్డుపాలవుతామని బస్తీల వాసులు ఆందోళన చెందుతున్నారు. దీంతో పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ముందుకు సాగే అవకాశాలు కనిపించడం లేదు.