హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): నీటిపారుదల శాఖలో పైరవీల జోరు మొదలైంది. రెండు కీలక ఈఎన్సీ పోస్టులు ఈ నెలాఖరులో ఖాళీ కానున్నాయి. ఈఎన్సీ రమేశ్‌బాబు, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) ఈఎన్సీ శ్రీనివాస్ ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేయనున్నారు. వాటిని దక్కించుకునేందుకు పలువురు ఇంజినీర్లు పోటీ పడుతున్నారు. సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, స్థాయికి తగ్గట్టుగా పైరవీలు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా అడ్డదారుల్లో వచ్చినవారినే అందలం ఎక్కిస్తున్నదనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈఎన్సీ పోస్టులు అర్హులకు దక్కుతాయా? లేదా ప్రభుత్వ పెద్దలు సీనియార్టీతో సంబంధం లేకుండా తమకు నచ్చినవారికి పట్టం కడతారా? అని జలసౌధలో జోరుగా చర్చ జరుగుతున్నది.
ప్రభుత్వం రెండు నెలల కిందటే డీపీసీ (డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ) ద్వారా పలువురు సీఈలకు ఈఎన్సీలుగా ఉద్యోగోన్నతి కల్పించింది. వారిలో రమేశ్‌బాబు కూడా ఉన్నారు. ఆయనతోపాటు ఈఎన్సీ అడ్మిన్ తమటం శ్రీనివాస్, కరీంనగర్ ఈఎన్సీ, నిజామాబాద్ సీఈ మధుసూదన్‌రావు, వాలంతరీ డీజీ అనితకు ప్రమోషన్ కల్పించింది. నెలాఖరున ఖాళీ కానున్న రెండు ఈఎన్సీ పోస్టులు అత్యంత కీలకమైనవి కావడంతో వీరిని పరిగణనలోకి తీసుకుంటారా? లేదా అనే చర్చ జరుగుతున్నది. ఈఎన్సీ మధుసూదన్ పేరు పరిశీలనలో ఉన్నా, ఆయన ఏపీ క్యాడర్ కావడంతో అవకాశం ఇస్తారా? అన్న సందేహం నెలకొంది. ఆయన ఇప్పటికే నిజామాబాద్ సీఈగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం వాలంతరీ డీజీగా కొనసాగుతున్న అనితకు అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే అడ్మిన్‌లో డిప్యూటీ ఈఎన్సీగా పనిచేసిన ఆమెను గతంలోనే ప్రభుత్వం కావాలని పక్కన పెట్టినట్టు చర్చ జరుగుతున్నది. ఆమె కూడా ఈఎన్సీ పోస్టుపై అంత సుముఖంగా లేరని చెప్పుకుంటున్నారు. మరోవైపు మరో ఆరు నెలల దాకా డీపీసీ వేయడానికి అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఖాళీ కాబోతున్న ఈఎన్సీ జనరల్, ఓ అండ్ ఎం పోస్టుల నియామకంపై ఆసక్తి నెలకొన్నది.
ఖాళీ అవుతున్న ఈఎన్సీ పోస్టుల కోసం పలువురు ఇంజినీర్లు జోరుగా పైరవీ చేస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. ఓఅండ్ఎం విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు సీఈలు సచివాలయంలోని ఓ కీలక అధికారి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్టు జలసౌధలో చర్చ జరుగుతున్నది. కొందరు సీనియర్ సీఈలు సీఎంవో స్థాయిలో, మరికొందరు తమకు తెలిసిన ప్రజాప్రతినిధుల ద్వారా పోస్టుల కోసం లాబీయింగ్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. దీనికి ప్రభుత్వ శైలి కారణమనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి ఇరిగేషన్ శాఖలో ఇప్పటికే అనేక చోట్ల ఎస్ఈలు, అనేక సర్కిళ్లలో ఈఈ పోస్టులు ఖాళీ అయ్యాయి. ప్రమోషన్లను కల్పించి ఆయా పోస్టులను భర్తీ చేయాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది. డీపీసీ ఏర్పాటు చేయకుండా, అర్హులైన ఇంజినీర్లకు ప్రమోషన్లు కల్పించకుండా చోద్యం చూస్తున్నది. ఇన్చార్జులు, ఇతరులకు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ నెట్టుకొస్తున్నది. వాస్తవానికి ఈఎన్సీ, సీఈ, ఎస్ఈ, ఈఈ ఇలా ఏ పోస్టు ఖాళీ అయినా వెంటనే సీనియారిటీ జాబితాలో అక్కడే ఉన్న ఇంజినీర్‌కు, ఒకవేళ అక్కడ సీనియర్ ఇంజినీర్ లేకుంటే ఆ బాధ్యతలను పక్కనే ఉన్న ఇతర సీఈ, ఎస్ఈ, ఈఈలకు అప్పగించడం ఆనవాయితీ. కానీ ప్రభుత్వం ఆ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కిందని విమర్శలు ఉన్నాయి. నచ్చినోళ్లకు, పైరవీలు చేసినోళ్లకే బాధ్యతలను అప్పగిస్తూ వస్తున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే తరహాలో నెలాఖరున ఖాళీ కానున్న రెండు ఈఎన్సీ పోస్టులను సైతం అడ్డదారిలో వచ్చినవారితో భర్తీ చేస్తారనే ప్రచారం జరుగుతున్నది. ఆశావాహ ఇంజినీర్లు తమవంతుగా పైరవీలను ముమ్మరం చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ తీరుపై ఇంజినీరింగ్ సంఘాలు ఇప్పటికే గుర్రుగా ఉన్నాయి. సీనియర్లను పక్కనపెడుతూ జూనియర్లకు కీలక బాధ్యతలను అప్పగించడాన్ని ఆక్షేపిస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా ఎక్స్టెన్షన్లను ఇవ్వబోమని చెప్పినా, తాజాగా పలువురికి ఎక్స్టెన్షన్లు ఇచ్చిందని, వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఖాళీ అవుతున్న ఈఎన్సీ పోస్టుల భర్తీకి సైతం ఇంజినీరింగ్ సంఘాలు పలు డిమాండ్లను వినిపిస్తున్నాయి. ఇరిగేషన్‌శాఖలో దీర్ఘకాలంగా ప్రమోషన్లు నిలిచిపోవడంతో అనేకమంది సీనియర్లు ఇప్పటికే నష్టపోయారని, ఈఈ, ఎస్ఈలుగా విరమణ పొందారని గుర్తుచేస్తున్నారు. నిరుడు 13మంది ఎస్ఈలకు సీఈలుగా ఆలస్యంగా ప్రమోషన్లను కల్పించారని, అందులో అనేకమంది సీనియర్లు ఉన్నారని చెప్తున్నారు. సీఈగా ఏడాది కాలం సర్వీసు పూర్తిచేయాలనే నిబంధనను సాకుగా చూపి డీపీసీ ఏర్పాటు చేయడం లేదని అంటున్నారు. దీంతో వారు ఈఎన్సీగా అవకాశం పొందని పరిస్థితి నెలకొన్నదన్నారు. ప్రభుత్వం ఎక్స్టెన్షన్లు ఇవ్వకుండా, జూనియర్లకు ఈఎన్సీలుగా అవకాశమివ్వకుండా, సీనియర్లకే మొదటి ప్రాధాన్యతనివ్వాలని కోరుతున్నారు. వనపర్తి సీఈ పీవీ నాగేంద్ర, సీఈ సీడీవో ఎం సత్యనారాయణరెడ్డి, మహబూబ్‌నగర్ సీఈ ఏ సత్యనారాయణరెడ్డి తదితర సీనియర్లకే ఎఫ్ఏసీలుగా అవకాశం కల్పించాలని ఇంజినీర్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సీఈ ఖాళీలను భర్తీ చేయాలని కోరుతున్నాయి.