Putta Madhukar | రామగిరి, మే 25 : కాంగ్రెస్ పార్టీ తన నిజస్వరూపాన్ని ఏనాడు విస్మరించలేదని, ఆ పార్టీకి ఎప్పుడూ వెలుగులు వస్తే అప్పుడు సమాజానికి చీకటే అలుముకుంటుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. సింగరేణి ఆర్జీ-3 డివిజన్ ఓసీపీ-2 గేట్ సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. పదేండ్ల పాటు సింగరేణి సంస్థను అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన బీఆర్ఎస్, టీబీజీకేఎస్ ఇటు సింగరేణికి, అటు ప్రజలకు రక్షణ అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 420 హమీలు, ఆరు గ్యారెంటీలతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ సింగరేణి కార్మికులకు 250గజాల స్థలం, రూ.20లక్షల ఇస్తామని చెప్పి మోసం చేసిందని, ఈ ప్రాంతంలో ఎవరికైనా ఒక్కరికి స్థలం, పైసలు ఇచ్చిండ్లా అని ఆయన ప్రశ్నించారు.
రెండేళ్ల కాలంలోనే కాంగ్రెస్ నిజస్వరూపం తెలిసి అనేక మంది బయటకు వస్తున్నారని, ముందుగానే గ్రహించిన జీవన్‌రెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ ఆకునూరి మురళీ లాంటి కాంగ్రెస్‌ను వీడారని ఆయన గుర్తు చేశారు. కమ్యూనిస్టు ఆలోచనలు ఉన్నవారు ఇప్పటికైనా బయటకు రావాల్సిన అవసరముందని అన్నారు. ఎన్నికలు వస్తే మొసలి కన్నీళ్లతో మన ముందుకు వచ్చి మళ్లీ మోసం చేసే ప్రమాదం ఉందని ఆయన గుర్తు చేశారు. సింగరేణి ఓసీపీ-2లో ఎక్కడెక్కరి వారో వచ్చి పని చేసేవారని, కానీ ఈనాడు పరిసర ప్రాంతాల వారు ఇక్కడ కార్మికులుగా పని చేస్తున్నారని చెప్పారు. అలాగే వ్యవసాయ రైతులుగా ఉన్నారని, వీరంతా ప్రభుత్వ పనితీరుతో ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అర్తం అవుతుందన్నారు. ఇటు కార్మికులను, అటు కర్షకుల పరిస్థితులు ఈనాడు మనకు కల్లకు కట్టినట్లు కన్పిస్తుందన్నారు. ఆనాడు గొప్ప గొప్ప మాటలు చెప్పితే వాళ్ల నోటికి మొక్కాలని కేసీఆర్ అన్నారని పేర్కొన్నారు.
ఇన్నీ హమీలు ఎలా అమలు చేస్తరని అడిగితే ‘సంపద సృష్టిస్తం.. కడుపు కట్టుకుంటం.. ప్రజలకు పంచుతామని ఎవరు వినని గొప్ప మాటలు చెప్పి ఈనాడు గద్దెను ఎక్కిండ్లని’ వారు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఒక రిటైర్డ్మెంట్ కార్యక్రమానికి వెళ్తే అక్కడ కార్మికుల కండ్లలో ఆనందం చూడలేదని, కన్నీళ్లే కన్పించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డిపెండెంట్ కార్మికులను అన్‌ఫిట్ చేస్తున్నారని, ఇంకా ఆనాడు తమ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన డిపెండెంట్ ఉద్యోగాలపై ఎంక్వైరీ చేస్తమంటున్నారని ఆయన అన్నారు. మీరు ఓట్లేసిన ఎమ్మెల్యేలు ఎక్కడ ఉంటున్నరో కనబడుతరలేదు, మంథని ఎమ్మెల్యే మాత్రం హైదరాబాద్‌లోనే ఉంటానని చెప్పినా ఆయనకే అవకాశం ఇచ్చారని అన్నారు. పదేండ్ల అన్ని రంగాల్లో ముందుకు పోయిన సంస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని, కార్మికులను ఇబ్బందులు పెడుతన్నారని ఆయన వాపోయారు. ఆనాడు సింగరేణి సంస్థ భూసేకరణలో ముందు వరుసలో నిలిచి సంస్థకు అండగా నిలిచామని, కార్మికులకు, అగిసోయిన వారసత్వ ఉద్యోగాలు తీసుకువచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. సింగరేణి కార్మికులు తెలంగాణ ఉద్యమంలో సింహబాగం ఉన్నారని, 40రోజుల పైచిలుకు సమ్మె చేసి కార్మికులు ఏ నాయకుడు ఎలా ఉంటడని ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కాంగ్రెస్ ఎప్పుడు అండగా ఉండదని, ఇక కమ్యూనిస్టు పార్టీ పని అయిపోయిందన్నారు. ఖమ్మంలో ఇండ్లను కూలగొడుతుంటే ఒక్కరు కూడా ముందుకు పోలేదని ఆయన వివరించారు. కింది నుంచి పైవరకు ఇండ్లను కూలగొట్టడం, ఉద్యోగాలు తొలగించడం, భూములు గుంజుకోవడం, రియల్ ఎస్టేట్ దందాల కోసమే కాంగ్రెస్ పని చేస్తుందని ఎద్దేవా చేశారు. దేశానికి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ శ్రేయస్కరం కాదని, ఆనాడే మహాత్మా గాంధీ చెప్పిండని, ఇవాల స్పష్టంగా కనిపిస్తుందన్నారు. భారత రాజ్యాంగం ఇచ్చిన అంబేద్కర్ నుంచి అట్టుడుగు వర్గాలను మోసం చేసి హింసించిన కాంగ్రెస్ ఆనాడు అంబేద్కర్‌ను అవమానపర్చిందన్నారు. కేసీఆర్ దళిత బంధు ఇస్తే అంబేద్కర్ అభయహస్తం రూ.12లక్షలు ఇస్తమని మోసం చేసిండ్లని విమర్శించారు. సింగరేణిలో క్వాంటిన్లు బాగు చేస్తమని మోసం చేశారని, ఏనాడైనా మన పిల్లల చదువుల గురించి, తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఆలోచన చేసిండ్లా అని ప్రశ్నించారు. ఆనాడు కేసీఆర్ అమలు చేసినవే తప్ప కొత్తగా అమలు చేస్తన్నవి ఏమీ లేదన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రజాపాలన చూసి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చిండ్లని సమయం ఎప్పుడు వస్తదని ఎదురుచూస్తున్నరన్నారు.
మూడు ఓట్లు ఉన్న కుటుంబానికి 40ఏండ్లు అధికారం ఇస్తే 35వేల ఓట్లు ఉన్న కులానికి నాలుగు ఏండ్లు అవకాశం ఇచ్చిండ్లని ప్రజాస్వామ్య విలువలు ఏ విధంగా ఉన్నయో అర్థం కావడం లేదన్నారు. సింగరేణి కార్మికులు మాత్రమే రాష్ట్రాన్ని రక్షించగలుగుతరన్నారు. ఐటీ మినిష్టర్ చేతిలో ఉద్యోగాలు ఉన్నా ఒక్కరికి ఇప్పించలేదని, ఒక్క ఇండస్త్రీ ప్రతిపాదన లేదన్నారు. ఈ ప్రాంతంలో సహజ వనరులు ఉన్నా వాటి ద్వారా పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి పెట్టడం లేదన్నారు. వేల సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉన్నా ఆ దిశగా మంత్రి ఆలోచన చేయడంలేదని, ఎన్నికలు వస్తే ఇస్త్రీ లేని బట్టలు వేసుకుని వచ్చి మనల్ని మళ్లీ మోసం చేయాలని చూస్తారని అన్నారు.
సింగరేణి కార్మికులు గొప్పగా ఆలోచన చేసి సమయం దొరికినప్పుడల్లా చర్చ పెట్టాలని, ప్రజలను చైతన్యం చేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ గేట్ మీటింగులో టీబీజీకేఎస్ నాయకులు వేముల రవిశంకర్, దేవ శ్రీనివాస్, దాసరి మల్లేష్, ఇసంపల్లి రమేష్, శ్రీనివాస్ రెడ్డి, పింగళి సంపత్ రెడ్డి, సుద్దాల తిరుపతి, వీవీ గౌడ్, పొన్నం సదయ్య, సైండ్ల సత్యనారాయణ, అల్లం రమేష్, బద్దె ఉదయ్, బీఆర్ ఎస్ నాయకులు పూదరి సత్యనారాయణ గౌడ్, కుమార్ యాదవ్, కాపురబోయిన భాస్కర్, దామెర శ్రీనివాస్, రోడ్డ శ్రీనివాస్, మెడగోని రాజన్న, గాజుల ప్రసాద్, అసం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.