RTC | రామగిరి, జనవరి 18 : మంథని నుంచి హైదరాబాద్కు వెళ్లే బస్సు సౌకర్యం పూర్తిగా గగనంగా మారింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పట్నం నుంచి పల్లెకు వచ్చిన ప్రయాణికులు తిరుగు ప్రయాణంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరిపడా బస్సులు లేకపోవడంతో గంటల తరబడి బస్టాండ్లలో నిరీక్షించాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా రామగిరి, సింగరేణి కార్మిక క్షేత్రం సెంటినరీకాలనీ,బేగంపేట, తదితర ప్రాంతాల్లో జేఎన్టీయూ, హార్టీ కల్చర్ కళాశాల, వంటి వివిధ విద్యా సంస్థలు కలిగి ఉండి ఇంకా అనేక ప్రైవేట్ కంపెనీలు ఉండడం హైదరాబాద్,కు వెళ్లే ప్రయాణికుల సంఖ్య నిత్యం ఉంటుంది. ప్రస్తుతం సంక్రాంతి పండుగ అనంతరం ఒక్కసారిగా పెరిగింది.
అయితే ఆ మేరకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో సీట్లు దొరకని పరిస్థితి నెలకొంది. కొందరు ప్రయాణికులు నిల్చునే ప్రయాణం చేయాల్సి వస్తుండగా, మరికొందరు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ రోజుల్లో ఉండే బస్సు చార్జీలతో పోలిస్తే రెట్టింపు ధరలు వసూలు చేయడం వల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. పండుగలకు ముందు గ్రామాలకు వెళ్లేందుకు అదనపు బస్సులు ఏర్పాటు చేసిన ఆర్టీసీ, తిరుగు ప్రయాణానికి మాత్రం తగిన ఏర్పాట్లు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పండుగకు ఇంటికి రావడం సంతోషమే కానీ, తిరిగి ఉద్యోగాలకు చేరుకోవాలంటే పడే ఇబ్బందులు చెప్పలేనివనీ ప్రయాణికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి మంథని–హైదరాబాద్ రూట్లో ప్రత్యేక బస్సులు, అదనపు సర్వీసులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అలా చేస్తేనే పండుగ అనంతర ప్రయాణికుల కష్టాలు తీరుతాయని వారుఅభిప్రాయపడుతున్నారు.