మెట్పల్లి రూరల్, డిసెంబర్ 4 : నామినేషన్లు తిరస్కరణకు గురవుతాయేమోనన్న ముందుచూపుతో భార్యాభర్తలు, కొడుకు సర్పంచ్ అభ్యర్థిత్వానికి నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఉపసంహరణకు అవకాశమివ్వకపోవడంతో ఆ ముగ్గురు సర్పంచ్ బరిలో నిలవాల్సిన వింత పరిస్థితి నెలకొన్నది. మొదటి విడుత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మెట్పల్లి మండలం జగ్గసాగర్ సర్పంచ్ స్థానం బీసీ జనరల్‌కు కేటాయించగా, పుల్ల సాయాగౌడ్ నామినేషన్ దాఖలు చేశాడు. తన నామినేషన్ తిరస్కరణకు గురవుతుందేమోనని అనుమానంతో ముందు జాగ్రత్తగా ఆయన భార్య పుష్పలత, కొడుకు వెంకటేశ్‌తో నామినేషన్లు దాఖలు చేయించాడు. అయితే గ్రామం లో సర్పంచ్ స్థానానికి మొత్తం 12 నామినేషన్లు దాఖలైన నేపథ్యంలో సర్పంచ్ పదవికి వీడీసీ వేలంపాట నిర్వహించినట్టు, ఓ అభ్యర్థి 28.60 లక్షలకు దక్కించుకున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
దీంతో అధికారు లు వీడీసీ సభ్యులను తహసీల్దార్ ఎదుట బైండోవ ర్ చేయడంతోపాటు బుధవారం గ్రామస్తులతో స మావేశం నిర్వహించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిబంధనలకు లోబడి ఎన్నికలు జరుగుతాయని, నామినేషన్లు ఉపసంహరించుకోవాలని వీడీసీ ఆం క్షలు విధిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అభ్యర్థులంతా స్వేచ్ఛగా పోటీ చేయాలని సూచించారు. ఈ క్రమంలో ఉపసంహరణకు అవకాశం ఇవ్వలే దు. ఫలితంగా ఒకే కుటుంబం నుంచి నామినేషన్లు వేసిన భర్త, భార్య, కొడుకు సర్పంచ్ బరిలో నిలవాల్సిన విచిత్ర పరిస్థితి నెలకొన్నది. దీంతో ము గ్గురు కలిసి ప్రచారం చేస్తూ సాయాగౌడ్‌కు ఓటువేసి సర్పంచుగా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.