కోరుట్లలో ఓ భర్త భార్య కోసం మహిళా సంఘాలతో కలిసి ఆందోళన
korutla | కోరుట్ల, మే 4: చాలా సందర్భాల్లో తన భర్త తనను కాదన్నాడని, అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని, అత్తింటి వేధింపులపై భార్య అత్తింటి ఎదుట నిరసన చేయడం తరచూ చూస్తుంటాం. దీనికి భిన్నంగా కోరుట్లలో ఓ వ్యక్తి తన భార్య కాపురానికి రావాలంటూ మహిళ సంఘాలు, కుటుంబసభ్యులతో కలిసి అత్తింటి ఎదుట నిరసనకు దిగిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. బాధితుడు గాజుల అజయ్ కథనం ప్రకారం.. పట్టణంలోని ప్రకాశం రోడ్డు కాలనీకి చెందిన శివానితో అదే ప్రాంతానికి చెందిన గాజుల అజయ్ కి నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్య గర్భం దాల్చిన తర్వాత అజయ్ ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టాడు.
అత్తారింట్లో అత్త మామలతో కలిసి శివాని ఉంటుండగా, మూడేళ్ల క్రితం శివాని బాబుకు జన్మనిచ్చింది. అత్త, మామలతో గొడవల కారణంగా కొద్ది నెలల క్రితం శివాని పుట్టింటికి వచ్చింది. అజయ్ తన భార్యకు గల్ఫ్ నుంచి పలుమార్లు ఫోన్ చేసిన రిసీవ్ చేసుకోకపోవడంతో 10 నెలల క్రితం ఇండియాకు వచ్చాడు. తన భార్యకు ఎన్నిసార్లు నచ్చజెప్పినా కూడా తనకు దూరంగా ఉంటూ వస్తుందని, ఇప్పటి వరకు తన కుమారుడిని చూడలేదని అజయ్ అవేదన వ్యక్తం చేశాడు. తన భార్య అత్త, మామలను ఆనాథశ్రామంలో చేర్పించాలని టార్చర్ పెట్టిందని వాపోయాడు.
తల్లిదండ్రులకు తాను ఏకైక సంతానమని అయినా అత్త, మామ వద్దంటే వేరు కాపురం పెట్టడానికి సిద్దపడ్డానని, భార్య కోసం గల్ఫ్ నుంచి కోరుట్లకు వచ్చి బట్టల దుకాణంలో పని చేస్తున్నానని తెలిపాడు. తన భార్య, కుమారుడు తనకు కావాలని భార్యను కాపురానికి పంపించాలని వేడుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని ఇరు కుటుంబాల సభ్యులను సముదాయించి స్టేషన్ కు తరలించారు. కాగా మహిళ సంఘాల సభ్యులు అజయ్ కి మద్దతుగా నిలిచారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలతో సంసారం నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.
అత్తింటి వారితో ప్రాణహాని ఉంది : శివాని
అత్తింటివారితో తనకు ప్రాణహాని ఉందని అందుకే తాను పుట్టింటికి వచ్చానని శివాని ఆరోపిస్తుంది. తన ఒంటిపై ఉన్న బంగారు నగలు లాక్కున్నారని, మానసికంగా హింసిస్తున్నారని, చంపాలని చూస్తున్నారని, అత్తారింటికి పోనని తెగేసి చెబుతోంది. గతంలో అత్తమామల వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. పోలీసుల ఎదుటే తనను నానా దుర్భాషలాడారని, తనకు అత్తింట్లో రక్షణ లేదని తన భర్తతో కాపురం చేయలేనని తేల్చి చెప్పింది.