Godavarikhani | కోల్ సిటీ, జూన్ 16 : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఐటీయూ అనుబంధ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం మున్సిపల్ కార్మికుల అడ్డాపై జరిగిన సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండున్నర యేళ్లు గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదన్నారు.
అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన విధంగానే మున్సిపల్ కార్మికులు సైతం మోసపోయారని అన్నారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలనీ, రెండో పీఆర్సీలో కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు నిర్ణయించి కేటగిరిలుగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యంను ఎండగడుతూ ఈనెల 18, 19 తేదీల్లో అన్ని మున్సిపల్ కార్యాలయాల ఎదుట నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.