పెద్దపల్లి, జూన్ 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సంకల్పం సాక్షాత్కరిస్తున్నది. పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా బీఆర్ఎస్ హయాంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్మించిన 484 డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి వేళయింది. వివరాల్లోకి వెళితే.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని చందపల్లిలో జీప్లస్ +2, 3 పద్ధతిలో 196, రాంపల్లిలో జీప్లస్ +2 పద్ధతిలో 288 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని సకల హంగులతో పూర్తి చేశారు. అయితే ఆయా సముదాయాల వద్ద ఇంకా రోడ్లు, డ్రైనేజీలు, తదితర పనులు మిగిలి పోయాయి. తర్వాత అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు చొరవతో కొత్త ప్రభుత్వం చేపట్టింది. అదే సమయంలో లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్లను కేటాయించింది. అన్ని పనులు పూర్తి కావడంతో గృహప్రవేశాలకు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇండ్ల తాళాలు అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.